హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. ఇరు రాష్ట్రాల పాలకుల తప్పులనూ ఎత్తిచూపుతూ తటస్థవైఖరి ప్రదర్శించటానికి ప్రయత్నించారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని, దానిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూనే, హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుకు తాను వ్యతిరేకమని చెప్పారు. విజయనగరానికి చెందిన ఆనంద్ సాయి అనే ఆర్కిటెక్ట్‌ను యాదాద్రి ఆలయానికి కీలకబాధ్యతలు అప్పగించి తెలుగుజాతి ఐక్యతకు బీజంవేశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు ప్రకటించారు. సీమాంధ్ర ఎంపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎంపీలు పార్లమెంటుకు వెళ్ళి నోరు మెదపకుండా గోడలు, స్తంభాలు చూస్తూ తిరుగుతున్నారని, ఏపీకీ ప్రత్యేక హోదాగురించి కిమ్మనటంలేదని విమర్శించారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రలూ అవసరమైతే పదవులకు రాజీనామాచేసి ఏపీకి ప్రత్యేక హోదాకోసం పోరాడాలని, తెలంగాణ నాయకుల పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఇరు పార్టీల ముఖ్యమంత్రులూ సంయమనంతో వ్యవహరించాలని హితవు చెప్పారు. చంద్రబాబు ఫోన్ సంభాషణపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వకుండా, టీడీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేను ప్రభుత్వంలో చేర్చుకోవటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఆంధ్రోళ్ళు అంటే కమ్మవారు మాత్రమే కాదని, అన్ని కులాలవారూ సీమాంధ్రలో ఉంటారని పవన్ చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యవహారం పొలిటికల్ గేమ్ అని, ఇరురాష్ట్రాలూ విభజనతాలూకు విబేధాలతో కొట్టుకుంటున్న ఈ తరుణంలో ఈ గేమ్ ఆడటం సరికాదని అన్నారు.