జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు మంగళవారం నుంచి పర్యటనలు ప్రారంభించనున్నారు. ముందుగా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ. లక్ష ఆర్ధిక సాయం చేస్తారు. తర్వాత ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందిస్తారు. గొట్లూరు, అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట, మన్నీల గ్రామాల్లోని రైతుల కుటుంబాలకు సాయం చేస్తారు.
సాయంత్రం సమయానికి మన్నీల గ్రామంలో రచ్చబండ నిర్వహిస్తారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్ధిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు. పవన్ కల్యాణ్ పర్యటన రోజంతా బిజిబిజీగా సాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు సాయం చేస్తాననిపవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏడు వందల మందికిపైగా రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వీరికి సాయం చేసేందుకు తాను రూ. ఐదు కోట్ల విరాళం కూడా ఇచ్చారు.
ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గతంలో చేపట్టిన ఓదార్పు యాత్ర తరహాలోనే ఈ యాత్ర కూడా సాగనుంది. రోజంతా ఆయన నాలుగైజు నియోజకవర్గాలను చుట్టి రైతు కుటుంబాలను పరామర్శించారు. తర్వాత ఇతర జిల్లాలలోనూ పర్యటించనున్నారు. ఓ రకంగా పవన్ జిల్లాల పర్యటనలు ప్రారంభమయ్యాయని అనుకోవచ్చు.