సినిమాలు వేరు, రాజకీయాలు వేరు! కానీ, సినీ తారలు రాజకీయాల్లో రాణించడం అనేది కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే, అందరూ రాణించడం లేదు. కొందరు మాత్రమే నాయకులుగా ప్రజాదరణ పొందారు, చరిత్ర తిరగరాయగలిగారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే తరహా సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొన్నారు. కానీ, ఫలితాల్లో పార్టీ ఉనికిని కూడా చాటుకోలేకపోయారు. ఎందుకిలా జరిగింది..? ఎన్నికల ముందు పవన్ సాగించిన ఉద్వేగ భరిత ప్రసంగాలకు ఉర్రూతలూగిన జనమంతా ఏమైనట్టు..? రాజకీయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడతానంటూ చెప్పిన కొత్త సిద్ధాంతాలకు కేరింత కొట్టిన యువత అంతా ఏమైనట్టు..? ఇలాంటి చాలా ముఖ్యమైన అంశాలపై జనసేనాని దృష్టి సారించి, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది.
ఇక్కడే, సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రాణించినవారికీ… ప్రస్తుతం పవన్ ఎదుర్కొన్న అనుభవానికీ మధ్య కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. నందమూరి తారక రామారావు తిరుగులేని సినీ గ్లామర్ నేపథ్యం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, ఆయన వచ్చిన వెంటనే… ప్రజల అవసరాలకు అనుగుణంగా, రాజకీయాలకు కావాల్సిన నాయకత్వం లక్షణాలను అలవరుచుకున్నారు. కథానాయకుడికీ ప్రజా నాయకుడికీ ఉన్న తేడా తెలుసుకుని, బాధ్యతల తీవ్రతను అర్థం చేసుకున్నారు. పక్క రాష్ట్రంలోని ఎంజీఆర్ గానీ, జయలలితగానీ… వారు కూడా రాజకీయాల్లోకి రాగానే, సినీ ఇమేజ్ చట్రం నుంచి బయటకి వచ్చేసి, ప్రజా నాయకులుగా మన్ననలు పొందారు. ఇదే కోణం నుంచి పవన్ కల్యాణ్ పనితీరును సమీక్షించుకుంటే… రాజకీయాల కోసం ఆయన సినిమాలు వదిలేసినా, సినీ ఫక్కీలోనే పార్టీని నడిపించే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు!
పవన్ ప్రసంగాలు, ప్రచార శైలి… ఇవన్నీ ఒక్కసారి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే… సమాజంలో ఒక మార్పు కావాలంటూ ఆయన సైద్ధాంతికంగా చెప్పిన అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. అవి వినడానికి బాగానే ఉంటాయి. పవన్ కల్యాణ్ లాంటివారు చెబుతుంటే మరింత ఆసక్తికరంగా ఉంటాయి. అయితే, ఈ సిద్ధాంతాలకు కార్యరూపం ఇవ్వాలంటే… క్షేత్రస్థాయిలో ఒక ప్రజా నాయకుడిగా పవన్ కల్యాణ్ చేసిన కృషి గురించి చెప్పుకోవాడానికి ఉదాహరణ లేవు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తానే తెరమీదికి తెచ్చానని చాలాసార్లు చెప్పారు. కానీ, హోదా సాధన కోసం పవన్ కల్యాణ్ స్వతహాగా ఉద్యమించిన సందర్భాలేవి..? ప్రజలను కలుపుకుని ముందుకు సాగిన ఉద్యమ కార్యాచరణ ఏది..? ఇలాగే ఇతర ప్రజాసమస్యలపైనా మాట్లాడుతూ వచ్చారే తప్ప…. ప్రజలను మమేకం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించుకోలేకపోయారని చెప్పొచ్చు. చివరికి, పార్టీ నిర్మాణంలో కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. తను అనుకున్న సిద్ధాంతం వైపు, తాను చేయాలనుకున్న పోరాటంలోకి ప్రజలను తీసుకుని రాలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాంటే… ప్రజలను ప్రేక్షక స్థానంలోనే ఉంచి, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కనిపించారు. ప్రజా నాయకుడి పాత్రలోకి పూర్తిగా మారలేకపోయారు అనిపిస్తుంది. ఏదైమేనా, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం కోసం వచ్చానని పవన్ అంటున్నారు కాబట్టి, ఇలాంటి విశ్లేషణలు చేసుకుంటే ఆ సుదీర్ఘకాల మనుగడ అనేది ఉంటుంది.