హైదరాబాద్: అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు విషయమై పవన్ ఫ్యాన్స్‌ను మీడియా రెచ్చగొట్టి వదిలి పెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వారు మండిపడుతున్నారు. మరి ఇది ఎక్కడికి వెళుతుందో చూడాలి.
చంద్రబాబునాయుడు అమరావతి ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి నలుగురితోబాటే అన్నట్లుగా మంత్రులను పంపించటంపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. మీడియావాళ్ళు చిచ్చును పెట్టకపోతే అసలు వాళ్ళ మనసులో ఈ ఆలోచన వచ్చేదికాదేమో. మంత్రులు ఆహ్వానపత్రికను ఇవ్వటానికి వెళ్ళినపుడు రిపోర్టర్లు ఈ విషయాన్ని పవన్ వద్ద ప్రస్తావించారు. కేసీఆర్‌ను ఆహ్వానించటానికి స్వయంగా వెళుతున్న చంద్రబాబు మీవద్దకు మాత్రం మంత్రులను పంపించటమేమిటని అడుగగా, ముఖ్యమంత్రిని ఆహ్వానించేటపుడు ప్రొటోకాల్ ప్రకారం ఆయనే స్వయంగా వెళ్ళి ఉంటారని పవన్ బదులిచ్చారు. అయితే ఆయన మాటలకు విరుద్ధంగా చంద్రబాబు నిన్న రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి మరీ రామోజీరావును స్వయంగా ఆహ్వానించటంతో ఫ్యాన్స్ అసంతృప్తి రెట్టింపయింది. ఎన్నికలముందు తమ నాయకుడిని వెతుక్కుంటూ వెళ్ళిమరీ మద్దతుకోసం ప్రాధేయపడిన చంద్రబాబుకు ఇప్పుడు ఆహ్వానపత్రిక ఇవ్వటానికి మాత్రం తీరటంలేదా అంటున్నారు.
మరోవైపు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన సేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ విషయాన్ని బాబే వెల్లడించారు. ఇవాళ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ దగ్గరకు మంత్రులను పంపించానని, తానుకూడా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించానని చెప్పారు. పవన్ వస్తానన్నారని, వస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.