షూటింగులు మొదలు పెట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా, స్టార్లెవరూ అందుకు సాహసం చూపించడం లేదు. పవన్ కల్యాణ్‌నీ ఈ జాబితాలో చేర్చేయొచ్చు. ఆయన చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. ముందుగా అనుకున్న ప్రకారం ‘వకీల్ సాబ్’కి కాల్షీట్లు ఇవ్వాలి. ముందుగా ఆ పని పూర్తి చేస్తే పవన్ రిలాక్స్ అవ్వొచ్చు. మరోవైపు క్రిష్ సినిమా కూడా కొంతమేర షూటింగ్ జరుపుకుంది. `వకీల్ సాబ్` తరవాత క్రిష్సినిమానే మొదలవ్వాలి. కానీ పవన్ ఆలోచనలు మారినట్టు, ఆయన హరీష్ శంకర్ సినిమాని మొదలెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి.
దాంతో నిర్మాత ఏఎం రత్నం కాస్త కంగారు పడినట్టు తెలుస్తోంది. ఎందుకైనా మంచిదని.. క్రిష్ సినిమా కోసం కాల్షీట్లు ఇవ్వాలని పవన్ ని సంప్రదిస్తే, పవన్ అందుకు సముఖంగా లేనట్టు తెలుస్తోంది. పవన్ దృష్టి కేవలం వకీల్ సాబ్ పైనే ఉందని, వీలైనంత త్వరగా ఈసినిమాని పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా పూర్తయ్యాకే మిగిలిన విషయాలు ఆలోచిస్తానని పవన్ చెప్పేశాడట. దాంతో.. ఏఎం రత్నం, క్రిష్ కాస్త డైలామాలో పడ్డారు. హరీష్ శంకర్ సినిమాపై కూడా పవన్ ఇప్పుడు దృష్టిపెట్టడం లేదని, వకీల్ సాబ్‌ని గట్టెక్కిస్తే చాలు, మిగిలిన విషయాలు తరవాత చూసుకుందాం అనే ధోరణిలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. అటు రత్నం గానీ, ఇటు క్రిష్ గానీ.. ఈ విషయంలో పవన్‌ని కూడా ఇబ్బంది పెట్టడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే క్రిష్ సినిమా భారీ హంగుల మధ్య తెరకెక్కించాలి. ప్రతీ సన్నివేశంలోనూ కనీసం 20 – 30 మంది నటీనటులు (జూనియర్ ఆర్టిస్టులతో కలిపి) అవసరం అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత భారీ క్రూ మధ్య షూటింగులు సాధ్యం కాదు. అందుకే పరిస్థితులు కాస్త సద్దుమణిగిన తరవాతే షూటింగ్ మొదలెట్టాలని క్రిష్ కూడా ఓ నిర్ణయానికి వచ్చాడట.