భీమ్లా నాయక్..
చాలా సార్లు వాయిదా పడిన సినిమాల్లో ఇదొకటి. కారణాలు అనేకం. రీషూట్లు చేశారని, త్రివిక్రమ్ హ్యాండిల్ చేస్తున్నాడని, సాగర్ చంద్రని పట్టించుకోవడం లేదని, మాతృకకు తూట్లు పొడిచే పనిలో ఉన్నారని, ఎన్నో రకాలుగా వార్తలు.. గాసిప్పులు. ఇవన్నీ సినిమాని ఇబ్బంది పెట్టే విషయాలే. పైగా భీమ్లాకి పబ్లిసిటీ పెద్దగా చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి జరిగింది. అది కూడా ఓసారి వాయిదా పడి. కేవలం ఒక రోజు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఇంటర్వ్యూలు లేనే లేవు. ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్, పుష్ప.. లాంటి పెద్ద సినిమాలు విడుదలకు ముందు ఏ స్థాయిలో పబ్లిసిటీ చేశాయో, చేస్తాయో ఊహించుకోండి. దాని ముందు.. భీమ్లా పబ్లిసిటీ జీరో.
ఇదంతా ఒక ఎత్తు.. ఏపీలో పరిస్థితి మరో ఎత్తు. భీమ్లా ఎప్పుడొస్తే అప్పుడు ఉక్కు పాదంతో ఈ సినిమాని అణచి వేయాలని చూసింది ఓ వర్గం. సినిమా విడుదలకు ముందే నెగిటీవ్ రివ్యూలు హోరెత్తడానికి కారణం అదే. మంత్రులు సైతం.. సినిమా ఎనలిస్టులుగా మారి రివ్యూలు ఇచ్చారంటే.. `భీమ్లా`పై ఎవరెంత ఫోకస్ పెట్టారో అర్థమవుతూనే ఉంది. టికెట్ రేట్లు మరీ… పార్కింగ్ రేట్లతో సమానంగా ఉన్న చోట ఓ పెద్ద సినిమా విడుదల చేయడానికి ఎంత ధైర్యం కావాలి..? మరో వారం, పది రోజులు ఆగితే, పెద్ద సినిమాలన్నింటితో పాటు భీమ్లాని దర్జాగా విడుదల చేయొచ్చు. గుంపులో గొవిందయ్యగా వస్తే.. భీమ్లాని ఆపేవాడే ఉండడు. అన్ని సినిమాలతో పాటుగా, పెంచిన రేట్లతో వసూళ్లని మరింత పెంచుకోవచ్చు. కానీ భీమ్లా నాయక్ అలా చేయలేదు. `దేహీ..` అంటూ చేతులు చాపలేదు. `మీరు రేట్లు పెంచేదేంటి? ఉన్న రేట్లతోనే రికార్డులు బద్దలు కొడతాం` అని సమరానికి దిగాడు. అన్నదే చేశాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో `భీమ్లా..`మానియా నడుస్తోంది. శుక్రవారం థియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఏ సెంటర్ లేదు.. బీ సెంటర్ లేదు. అన్ని చోట్లా… పవన్ ఫ్యాన్స్ ప్రభంజనమే. భీమ్లా దెబ్బకు తొలి రోజే రికార్డులు దాసోహం అన్నాయి. నైజాంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఓవర్సీస్లోనూ ఇంతే దూకుడు. ఏపీ లెక్కలు ఇంకా బయటకు రాలేదు గానీ, తక్కువ రేట్లు ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆశ్చర్యపరిచే అంకెలే చూడబోతున్నామని తెలిసింది. ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య… భీమ్లా నాయక్ ఇంత పెద్ద హిట్టు కొట్టాడంటే… అది కేవలం పవన్ క్రేజ్. పవన్ స్టామినాకు `భీమ్లా..`నే నిలువెత్తు నిదర్శనం. `అత్తారింటికి దారేది` తరవాత పవన్ బాక్సాఫీసు దగ్గర ఓ భారీ విజయాన్ని బాకీ పడిపోయాడు. ఆ బాకీ.. భీమ్లాతో తీర్చేశాడు. శభాష్… భీమ్లా నాయకా..!