హైదరాబాద్: పవన్ నిన్న చంద్రబాబును కలవటానికి బయలుదేరిన దగ్గరనుంచి మీడియాలో ఎన్నో ఊహాగానాలు, కథనాలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, బాబు దగ్గరకు పవన్ ఎందుకెళ్ళాడో ఆయనకే తెలియదని కొందరు, పవన్ రాజ్యాంగేతరశక్తిలాగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు ముఖ్యమంత్రితో సహా అధికార యంత్రాంగమంతా సాగిలపడటం, సంజాయిషీలు ఇవ్వటమేమిటని మరికొందరూ విమర్శలు గుప్పించారు. పవన్ మాత్రం – అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళలేకపోయినందున శుభాకాంక్షలు చెప్పటానికి వెళ్ళానని చెప్పారు. అయితే ‘ఊరకరారు మహాత్ములు’ అన్నట్టుగా – ఈ అగ్రనేతల భేటి ఊరికే… కేవలం మర్యాదపూర్వకంగా జరిగినది మాత్రం కాదని, వెనక ఏదో ఉందని తెలుస్తూనే ఉంది. ఆ ‘ఏదో’ ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గత కొన్నిరోజులుగా కాపు సామాజికవర్గం మీడియాలో కేంద్రబిందువుగా మారిన సంగతి తెలిసిందే. కాపులకు సంబంధించి రెండు పరిణామాలు ఈ మధ్య చోటు చేసుకున్నాయి. తమ సామాజికవర్గాన్ని బీసీీలలో చేరుస్తామని, ఏటా వెయ్యి కోట్లు ఇస్తామని గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలేదని, మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారని కాపు సామాజికవర్గ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవల రంగంలోకి దిగారు. డిసెంబర్ నెలాఖరులోపు బీసీలలో చేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అల్టిమేటమ్ ఇచ్చారు. మరోవైపు, మాజీమంత్రి, కాపు సామాజికవర్గానికి చెందిన తలపండిన రాజకీయ నాయకుడు హరిరామ జోగయ్య, తన ఆత్మకథ – ‘60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ను ఇటీవల ఏలూరులో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ పుస్తకంలో – కాపు సామాజికవర్గానికి చెందిన దివంగత మిలిటెంట్ నాయకుడు వంగవీటి మోహనరంగా హత్యకు గురవటం గురించి జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా హత్య వెనక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. ఒకరకంగా కాపులు మర్చిపోతున్న గాయాన్ని జోగయ్య మళ్ళీ రేపారు. దీనిని సహజంగానే ప్రతిపక్షాలు వాడుకోవటానికి ఉపక్రమించాయి. జోగయ్య పుస్తకంలోని నిజాలతో కాపు సామాజికవర్గం అట్టుడుకుతోందంటూ వైసీపీ, కాంగ్రెస్ నేతలు పెద్ద పెద్ద పద ప్రయోగాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ రెండు పరిణామాలూ తెలుగుదేశంలో కాకపుట్టించాయి.
ఇటీవల జరిగిన ఆ పరిణామాలతోపాటు కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న మరో పరిణామంకూడా తెలుగుదేశానికి ఇబ్బందికరంగా మారింది. అది – ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ నాయకుల విమర్శల దాడి. భారతీయ జనతాపార్టీ 2019 ఎన్నికల నాటికి కాపులను తమవైపుకు తిప్పుకోవాలని వ్యూహాలు పన్నుతుండటం, కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణవంటి వారితో ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తుండటం టీడీపీని మింగలేని, కక్కలేని పరిస్థితిలో పడేయటం తెలిసిందే. ఈ మూడు పరిణామాలతో 2014 ఎన్నికలలో తమకు ‘కాపు’ కాసిన సామాజికవర్గం చేజారిపోయేటట్లుందని టీడీపీ నాయకత్వానికి అర్థమయింది. అందుకే ఈ మూడు పరిణామాలను – ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా – ఎదుర్కునేందుకు ప్రో యాక్టివ్‌గా ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుని తమ తురుపు ముక్కగా పవర్ స్టార్‌ను రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. అదికాకుండా బాబు-పవన్ భేటీకి కామన్ ఎజండా ఏమీ లేదు. సమయమూ-సందర్భమూ కూడా లేదు. కేవలం పవన్‌ను గౌరవించి తద్వారా కాపులను సంతృప్తి పరచటమే లక్ష్యం. అందుకే సంక్రాంతి పండగకు అత్తారింటికి వచ్చే కొత్త అల్లుడికిలాగా మర్యాదలు చేశారు. తోడ్కొనిరావటానికి మనిషిని(మంత్రి కామినేని శ్రీనివాస్), ఛార్టర్డ్ ఫ్లైట్‌ను పంపారు. వచ్చినవాడికి సకల లాంఛనాలతో మర్యాదలు చేశారు. జ్ఞాపిక ఇచ్చారు… శాలువా కప్పి సత్కరించారు. షడ్రసోపేతమైన విందును కూడా పెట్టేవారే కానీ, ఇతను ఉపవాస దీక్షలో ఉన్నాడు. ఇన్ని చేసిన తర్వాత సాక్షాత్తూ ఆ భగవంతుడైనా ప్రసన్నుడు కాకుండా ఉండరు. పవర్ స్టార్ ఎంత!
బాక్సైట్ గనుల వివాదం, అమరావతిపైనే దృష్టి కేంద్రీకరించటంతో మిగిలిన ప్రాంత ప్రజలలో అసంతృప్తి చోటుచేసుకోవటం వంటి కొన్ని అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్ళానని, ఆయన సానుకూలంగా స్పందించారని పవన్ బయట మీడియాకు చెప్పారు. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తంమీద భేటీతో పవన్ బాగా ప్రసన్నుడయ్యారు. కానీ టీడీపీ నాయకత్వం అంతకు ఎన్నోరెట్లు ప్రసన్నమయింది. వారు అనుకున్న లక్ష్యం నెరవేరిందిగా మరి! కాపు సామాజికవర్గానికి ఒక అనధికార, అప్రకటిత నాయకుడిగా చలామాణిలో ఉన్న పవన్ కళ్యాణ్ తమ వెనక ఉన్నాడు అని లోకానికి నిరూపించదలుచుకున్నారు… అలాగే నిరూపించుకున్నారు. మిషన్ కంప్లీట్!
మరి ఈ మొత్తం వ్యవహారంలో తాను ఒక పావుగా వాడుకోబడ్డానన్న విషయం పవన్‌కు తెలుసా అంటే తెలియదనే చెప్పాలి. అయితే అన్న చిరంజీవిలాగా రాజకీయ అజ్ఞాని కాదు కాబట్టి, సమకాలీన పరిణామాలన్నింటినీ అధ్యయనం చేసే ఆలోచన, సహాయకులు ఉన్నారు కాబట్టి ఆలస్యంగానైనా విషయాన్ని గ్రహించక మానరు. గ్రహించిన తర్వాత ఆయన టీడీపీ విషయంలో ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి. అయితే నిన్నటి మీడియా సమావేశం తర్వాత ఒకటి మాత్రం స్పష్టమయింది. పవన్ గతంలోలా దూకుడుగా కాకుండా సావధానంగా, సంయమనంగా మాట్లాడుతున్నారు. కాబట్టి గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు విజయవాడ టికెట్‌ను తాను ప్రతిపాదించిన పీవీపీ ప్రసాద్‌కు ఇవ్వకపోవటంతో అలిగినట్లు కాకుండా మరింత పరిణతితో వ్యవహరించే అవకాశం ఉంది(నాడు విజయవాడ ఎంపీ టికెట్ విషయంలో కేశినేని నాని బాబుతో గొడవకు దిగటం, ఆయనను కాదనలేక పవన్‌కే నో చెప్పటం తెలిసిందే. దీనిపై పవన్ అలగటంతో బాబు ఆయన ఇంటికి వెళ్ళి బుజ్జగించి మళ్ళీ ప్రచారంలోకి దిగేలా చేశారు).
మరోవైపు జనసేన విషయంలో పవన్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వటంలేదు. 2019 ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేస్తానని మాత్రమే చెప్పారు. ఆ ఎన్నికలలోపు నాలుగైదు సినిమాలు చేసి డబ్బు సంపాదించి ఆర్థికంగా సమాయుత్తమవుదామని ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. రాజకీయపార్టీని నడపటం అంటే ఎంతో డబ్బుతో కూడుకున్న వ్యవహారమన్నది వాస్తవమే. ప్రస్తుతం ఆయనకు అంత ఆర్థిక స్థోమత లేకపోయి ఉండొచ్చు. అయితే ఆ దిశగానూ ఆయన వెళుతున్నట్లుగా కనిపిచంటంలేదు. ప్రస్తుతం చేస్తున్న సొంత సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను చాలా తీరికగా, మెల్లగా చేసుకుంటూ వెళుతున్నారు. మరి ఇదే వేగంతో వెళితే 2019 ఎన్నికల లోపు, పార్టీని నడపటానికి సరిపోయేటంత డబ్బును పవన్ సంపాదించేటట్లుగా అయితే కనిపించటంలేదు. ఏది ఏమైనా 2019 ఎన్నికలలో ఏపీలో చతుర్ముఖ పోటీ తప్పేటట్లు లేదు.