జనసేన పార్టీ ఇప్పుడు సక్సెస్ మోడ్ లో ఉంది. ఇలాంటి సమయంలో ట్రాక్ తప్పి అనవసర విషయాల మీద దృష్టి పెడితే మొదటికే మోసం వస్తుంది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. నెంబర్ టు గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా మంత్రిగా బిజీగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలపై ముఖ్యనేతల దృష్టి తగ్గింది. ఇలాంటి సమయంలో అనవసర వివాదాలు తెరపైకి వస్తున్నాయి.
అల్లు అర్జున్ అసలు వివాదమే లేదు. ఆయన మైండ్ పూర్తిగా రాజకీయాలకు అతీతం. రాజకీయంగా అయితే ఆయన మద్దతు పవన్ కు తప్ప ఇంకెవరికీ ఉండదు. స్నేహితుల కోసం ఎక్కడికైనా వెళ్తా అని చెప్పాడు. నంద్యాల వెళ్లినా… తాడిపత్రి ఎమ్మెల్యేతో పార్టీ చేసుకున్నా.. చిన్న సినిమా ఫంక్షన్ కు వెళ్లినా అది స్నేహం కోసమే. ఈ విషయాన్నే ఆ సినిమా ఫంక్షన్ లో చెప్పాడు కానీ.. జరుగుతున్న రాజకీయం వేరు.
పవన్ కు అల్లు అర్జున్ గతంలోనే మద్దతు ప్రకటించారు. ఆయన కుటుంబాన్ని కాదని వేరే పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉండదని అందరికీ తెలుసు. ఈ విషయంలో అర్జున్ వ్యవహారశైలిని అర్థం చేసుకుని ఆయన విషయంో జనసేన పార్టీ వీలైనంత వరకూ వివాదాలు సృష్టించుకోకుండా వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వంటి వాళ్లు కలుగ చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలతో ఈ వివాదం పెరుగుతుంది తప్ప… తగ్గదు.
పవన్ కల్యాణ్ వెంటనే జోక్యం చేసుకుని ఈ వివాదానికి చెక్ పెట్టాలని క్యాడర్ కోరుతోంది. అంతా ఒక్కటే అన్న చిన్న సంధేశం పంపడం ద్వారా మొత్తం సర్దుకుంటుందని.. వాడేసుకోవాలనుకుంటున్న వైసీపీకి షాక్ ఇచ్చినట్లవుతుందని అనుకుంటున్నారు. మరి పవన్ పట్టించుకుంటారో లేదో ?