ఎట్టకేలకు జనసేన అథినేత పవన్ కళ్యాణ్ కాస్త వేగంగా స్పందించడం మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఏ సంఘటనపైన అయినా గొడవంతా ముగిసిపోయి, జనం మర్చిపోయిన తర్వాత తీరుబాటుగా దానిపై స్పందిస్తాడని విశ్లేషకుల విమర్శలు ఎదుర్కునే పవన్… కాస్తయినా త్వరగా స్పందించిన సమస్య ఏదైనా ఉందంటే అది బహుశా ఇదే కావచ్చు.
ఎపిలోని విశాఖ సమీపంలోని పెందుర్తి, జెర్రిపోతుల గ్రామంలో 3 రోజుల క్రితం ఓ భూవివాదం నేపధ్యంలో దళిత మహిళపై దాడి చేసి వివస్త్ర చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చ ర్చనీయాంశం అయింది. ఈ సంఘటనలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, తేదేపా నేతలు పాల్గొన్నట్టు కధనాలు వచ్చాయి. దీనికి వీడియో సాక్ష్యం కూడా తోడైంది. మొత్తం మీద ఈ వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టింది. దీనిపై తేదేపా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఇచ్చిన వివరణ ఎవరినీ పెద్దగా కన్విన్స్ చేయలేకపోయింది.
ఇదిలా ఉంటే…తాజాగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ దీనిపై ట్వీట్ ద్వారా స్పందించాడు. దీనిపై స్పందించమంటూ దేశ విదేశాలకు చెందిన మహిళలు తనకు మెస్సేజ్‌లు పెడుతున్నారని చెప్పాడు. మహిళపై జరిగిన దాడి అమానుషం అన్నాడు. ఈ దాడికి పాల్పడింది తెదేపా నేతలే అనే విషయం తనకు తెలిసిందన్నాడు. ఈ సంఘటనకు ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశాడు. పోలీస్‌కమిషనర్ స్పందించాలని కోరాడు. బాధితులకు థైర్యం చెప్పాలని కార్యకర్తలకు సూచించాడు.
కొందరు చేసే తప్పు వల్ల ఇలాంటివి జరగడం కులాల మధ్య పోరుకు కారణం కాకూడదని పవన్ ఆకాంక్షించాడు. దళిత సంఘాలు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తేవడంలో తప్పులేదని, అయితే దీన్ని వివాదంగా మార్చవద్దని సూచించాడు.ఈ ఉదంతంలో వైసీపీ,, బిజెపి, టీడీపీలు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకోవాలన్నాడు. ప్రజాస్వామ్యంలో పౌరహక్కుల ఉల్లంఘన జరిగితే అందరూ ఖండించాలన్నాడు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని సూచించాడు. తాను సంఘటన జరిగిన ప్రాంతానికి రావడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని అందుకే రాబోవడం లేదన్నాడు. తమ పార్టీ తరపున ఒక బృందాన్ని పంపుతానన్నాడు. బాధితులకు న్యాయం జరగాలన్నాడు. ట్వీట్‌తో బాటే… ఓ చానెల్ లో ఈ సంఘటనకు సంబంధించి ప్రసారమైన కధనం గురించిన వీడియోను పవన్ షేర్ చేశాడు.