జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభల్లో కొంతమంది అభిమానులు ఎక్కువగా నినదించే మాట ‘సీఎం సీఎం సీఎం’ అని. అయితే, అలా అంటున్నంత మాత్రాన తనకేమీ అనిపించిందనీ, సీఎం పదవి అంటే అత్యంత బాధ్యతాయుతమైన స్థానమనీ, దానికి కొంత అనుభవం ఉండాలని గతంలో ఓ సందర్భంలో పవన్ చెప్పారు. అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు సీఎం ఎలా అవుతారని కూడా గతంలో అన్నారు. సరే, ఇప్పుడు పవన్ రాజకీయ పంథా మారింది. తెలుగుదేశం, భాజపాలతో సమాన దూరంలో ఉన్నానని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన స్వతంత్రంగానే 175 స్థానాల్లోనూ పోటీకి సిద్ధమనీ ప్రకటించారు. తాజాగా, గంగవరం గ్రామానికి పవన్ వెళ్లారు. ఈ సందర్భంగా కూడా సీఎం సీఎం అనే నినాదాలు వినిపించాయి.
ఓటు వేసి గెలిపించిన నాయకుల్ని గ్రామాల్లోకి రానివొద్దనీ, సమస్యలపై స్పందించనివారిని అడ్డుకునే హక్కు ఉందని పవన్ అన్నారు. బాధ్యతతో కూడిన కొత్త ప్రభుత్వాన్ని త్వరలోనే జనసేన ఏర్పాటు చేస్తుందని చెప్పారు! ప్రస్తుతం తాను సమస్యలపై మాట్లాడటం మాత్రమే చెయ్యగలననీ, ప్రజల అండ ఉంటే తన పోరాటం మరో విధంగా ఉంటుందని కోరారు. ఈ సందర్భంగా అభిమానులు సీఎం సీఎం అంటుంటే… ఇలాంటి నినాదాలతో సమస్యలకి పరిష్కారాలు లభించవన్నారు. ముందుగా ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలనీ, ఆ తరువాత పరిష్కారం కోసం కృషి చెయ్యాలని పవన్ స్పష్టం చేశారు.
సీఎం సీఎం అనే నినాదానికి పవన్ ఇప్పుడు కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేదు! ఓపక్క.. జనసేన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతూనే, మరోపక్క సమస్యలపై అవగాహన ఉండాలంటారు. అంటే, జనసేన అధికారంలోకి వస్తే సీఎంగా పవన్ ఉండరా..? అయినా, ఇంకా ఎందుకీ కన్ఫ్యూజన్..? ఎందుకీ డొంక తిరుగుడు..? పవన్ గానీ మరొకరుగానీ… రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టిందే అధికార సాధన కోసం. కేవలం ప్రజాసేవ కోసమే అనుకుంటే స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టుకోవచ్చు కదా. ఎవరైనా సరే, రాజకీయాల్లోకి వచ్చాక… అధికారం ద్వారానే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించగలరు, అదే వాస్తవం. 175 స్థానాల్లో పోటీకి సిద్ధమైనప్పుడు… ఆ పార్టీ తరఫున తానే సీఎం అభ్యర్థిని పవన్ చెప్పుకోవడంలో తప్పేముంది..? కానీ, అన్ని నియోజక వర్గాల్లో పోటీ అని పవన్ అంటారు, కానీ సీఎం పదవి చేపట్టేందుకు అనుభవం చాలదు అన్నట్టుగా మాట్లాడతారు! ఒక రాజకీయ పార్టీగా అధికారం కోరుకోవడం తప్పులేదు. అయితే, అనుభవం అనేది ప్రజలు నిర్ణయించే అంశం..! ఏ నాయకుడు అనుభవజ్ఞుడు, ఏ నాయకుడికి అవగాహన ఉందీ, రాష్ట్రానికి ఎవరు అవసరం.. అనేవి పరిగణనలోకి తీసుకుని ప్రజలు అధికారం కట్టబెడతారు.