రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏయే పార్టీలు తలపడనున్నాయ్? తెలుగుదేశం, వైసీపీ, జనసేన, భాజాపా, కాంగ్రెస్, కమ్యూనిస్టులు… ఇప్పటికైతే ఇవే కదా. మనకు తెలిసినవి. అయితే వీటితో పాటు తెలుగు సినిమాలు కూడా తలపడనున్నాయ్. అయితే ఇది అసలు ఎన్నికలకు కాస్త ముందుగా జరుగుతుంది అంతే.
ప్రస్తుత యధాతధ స్థితి ప్రకారం చూస్తే… తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ తీస్తున్న ఎన్టీయార్ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల అవుతుంది. . ప్రజల మనసుల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీయార్ పై అభిమానాన్నిమరింత రెట్టింపుజేసి, తద్వారా తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదాన్ని గుర్తుకు తెచ్చి ఆ మేరకు తమ పార్టీకి ఎన్నికల్లో లాభం కలిగేలా ఈ సినిమా ద్వారా తప్పక ప్రయత్నం చేస్తారనేది రాజకీయ వర్గాల అంచనా.
మరోవైపు ఇప్పటికే వర్మ ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీయార్… సంచలనం రేపుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఇరుకునపెట్టే లక్ష్మీపార్వతి ఎపిసోడ్ అంశాన్నే తన సినిమాకు నేపధ్యంగా ఎంచుకున్న వర్మ… రానున్న దీపావళికి తాను తీసిన సినిమా విడుదలై లక్ష్మీ బాంబులు పేలుస్తుందంటూ ప్రకటిస్తుండడం కూడా గమనించాం. పైగా ఈ సినిమాకు వైసీపీ నాయకుడే నిర్మాత కావడంతో ఈ సినిమా రూపకల్పన వెనుక రాజకీయ ప్రయోజనాలు లేవు అని అనలేం.
ఇదిలా ఉంటే. వర్మ సినిమాకు ధీటుగా లక్ష్మీస్ వీరగ్రంధాన్ని తెరకెక్కిస్తున్నానంటున్నాడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అనే దర్శకుడు. ఎన్టీయార్ జీవితంలోకి లక్ష్మీపార్వతి రాకముందు ఆమె భర్త వీరగంధం వెంకట సుబ్బారావు అనేది తెలిసిందే. వీరిద్దరి దాంపత్య బంధాన్నే తన సినిమాకు నేపధ్యంగా తీసుకున్నానంటున్న ఈ దర్శకుడు… తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ సినిమాను మలచనున్నాడనే సందేహాలు సహజమే…
రానున్న ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ కధతో ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. సమకాలీన రాజకీయాల నేపధ్యంతో దర్శకుడు క్రిష్ ఇప్పటికే పవన్‌కు కధ చెప్పాడని, ఈ కధ తనకు నచ్చిందని, ఎన్నికల ముందు నిశ్శబ్ధంగా ప్రారంభమై అంతే వేగంగా సినిమా ముగించాలని పవన్, క్రిష్‌కి సూచించాడని వార్తలు వస్తున్నాయి. వేగంగా సినిమా తీయడంలో ఇప్పటికే మంచి పేరున్న క్రిష్ దీనిని కేవలం 3నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నాడట.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పార్టీలు అత్యంత హోరా హోరీగా తలపడనున్నాయనేది నిస్సందేహం. ఈ నేపధ్యంలో ఈ సినిమాలన్నీ అనుకున్నట్టుగా తెరకెక్కి, ఈ లోపుగా మరి ఒకటో రెండో కూడా వీటికి జతగూడే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు ఆంధ్ర ఓటరునాడిని ఎవరి సినిమాలు ఎంత వరకూ ప్రభావితం చేస్తాయో చూడాలి.