ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మోదీ అపాయింట్మెంట్ పవన్‌కు ఖరారయింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ విశాఖ చేరుకుంటారు. పవన్ కల్యాణ్ కూడా అంతకు ముందే ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్తారు. మోదీతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. బీజేపీ నేతృత్వంలో రోడ్ షో జరగాల్సి ఉంది. ఆ రోడ్‌షోలో పవన్ కల్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై స్పష్టత రాలేదు. కానీ పవన్ మాత్రం మోదీతో భేటీ ఖాయమని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా రెండు రోజుల పాటు విశాఖలో పర్యటిస్తారు.
బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. కానీ ఇటీవలి కాలంలో వైసీపీతో తీవ్రంగా విభేధిస్తున్న పవన్.. బీజేపీని రోడ్ మ్యాప్ అడిగారు. కానీ ఆ పార్టీ స్పందించకపోవడంతో వ్యూహం మార్చుకుంటున్నానని ప్రకటించారు. కానీ పొత్తును వదిలేస్తున్నట్లుగా ప్రకటించలేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం జనసేనతో పొత్తు ఉంటుందని ఖరాఖండిగా చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకూ ఏపీలో ఏ ప్రముఖ నేత వచ్చినా పవన్ కల్యాణ్‌ను కలవలేదు. రెండు నెలల క్రితం మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పటికీ పవన్‌కు ఆహ్వానం అందలేదు. అందుకే ఈ సారి కూడా ఎలాంటి ఆహ్వానం ఉండదనుకున్నారు. కానీ పవన్‌కు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ లభించింది.
ప్రధాని మోదీ పర్యటనను వైసీపీ పూర్తి స్థాయిలో హైజాక్ చేసింది. మోదీ పర్యటన రాజకీయాలకు సంబంధం లేదంటూ.. మోదీ ఫోటోలను తమ పార్టీ రంగులతో వేసిన ఫ్లెక్సీల్లో విపరీతంగా వాడేసింది. మోదీ వైసీపీ నాయకుడా అన్నట్లుగా ఫ్లెక్సీలు వేసింది. ఈ కారణంతో.. వైసీపీతో ఏం సంబంధం లేదని.. ఆ పార్టీతో రాజకీయంగా సంబంధాలు ఉండవని చెప్పుకునేందుకు బీజేపీ.. పవన్‌తో మోదీ భేటీ ఎత్తుగడ వేసి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ర్యాలీలో మోదీతో కలిసి పవన్ పాల్గొంటే.. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న నమ్మకం కూడా బలపడుతుందని అంటున్నారు. కారణం ఏదైనా మోదీ, పవన్ కలయిక ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు తేనుంది.