సీఎస్ఆర్ నిధులన్నీ పీఎం కేర్స్‌కి.. సీఎంరిలీఫ్ ఫండ్‌కు పంపింగ్ చేస్తూంటే.. వాస్తవంగా ఆయా కార్పొరేట్ సంస్థలు ప్రజలకు చేయాల్సిన సేవ ఎలా చేస్తాయి..?. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా ఎత్తి చూపుతున్నారు. గోదావరి జిల్లాల్లోని కోనసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని ఆనేక సంస్థలు తోడుకుంటున్నాయి. వేల కోట్లు ఆర్జిస్తున్నాయి. కానీ కోనసీమ ప్రాంతానికి చేస్తున్న సాయం మాత్రం అంతంతమాత్రమే. చివరికి కోవిడ్ లాంటి సంక్షోభ సమయాల్లోనూ అదుకుంటున్న వారు లేరు. మొదటి విడత కరోనా వేవ్ సమయంలో… ఆయిల్ సంస్థ పెద్ద పెద్ద హామీలు ఇచ్చాయి.
కోనసీమలో రూ.200 కోట్లతో వైద్య వసతులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. కానీ రెండో వేవ్ వచ్చినా వాటి పనుల ఊసు లేదు. ఫలితంగా ఇప్పుడు.. కోనసీమ ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. కనీసం అంబులెన్స్ సౌకర్యాలు కూడా లేవు. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం చెబుతున్నట్లుగా.. ఎక్కడా సౌకర్యాలు కనిపించడం లేదు., చనిపోతే లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. వైసీపీ ఎంపీలు మాట్లాడుకున్న వీడియోలోని మాటలే సాక్ష్యం. ఆయిల్ కంపెనీలు తమ సీఎస్ఆర్ ఫండ్స్‌తో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసినా ఇబ్బంది ఉండేది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అందుకే పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ లేఖ రాశారు. ఆయిల్ కంపెనీలు.. హామీ ఇచ్చిన మేరకు.. అమలు చేశాయో ఉన్నతాధికారులు తక్షణమే సమీక్షించి.. ఆ హామీ కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సంక్షోభం సమయంలో.. ప్రభుత్వాలు సీఎస్ఆర్ నిధులను.. పీఎంకేర్స్, సీఎంఆర్ఎఫ్లకు ఇస్తే సరిపోతుందని రూల్ మార్చారు. ఫలితంగా కంపెనీలు పేదల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు.. ప్రభుత్వ ఖాతాలోకే వెళ్తున్నాయి.