జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎప్పుడైనా స్పెక్యులేషన్స్ వచ్చినప్పుడు సందర్భాన్ని చూసుకుని వాటికి చెక్ పెడుతూ వస్తున్నారు. ఇటీవల ప్లీనరీలో చేసిన నిలబెట్టాం వ్యాఖ్యల తర్వాత కూటమి లో ఏర్పడుతోందని భావిస్తున్న ఓ రాజకీయ అడ్డుగోడను అయన సింపుల్ గా బద్దలు కొట్టేశారు. పదిహేనేళ్ల పాటు వరుసగా ముఖ్యమంత్రిగా సీఎంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అంతకు ముందు అసెంబ్లీలోనూ ఇదే మాట చెప్పారు. పదిహేనేళ్ల పాటు కూటమి ఉంటుందన్నారు.
పవన్ కల్యాణ్ ఆయాచితంగా.. అప్పటికప్పుడు అనుకుని ఈ మాటలు చెప్పే అవకాశం లేదు. ఆయన తన మనసులోని మాటల్నే చెబుతున్నారని అనుకోవచ్చు. చంద్రబాబు వద్ద నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని భావిస్తున్నారు. చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన దగ్గర పని చేయడాన్ని సివిల్స్ సర్వీస్ అధికారులు కూడా ఓ. గొప్ప అనుభవంగా భావిస్తారు. నేర్చుకునేవారికి.. నేర్చుకున్నంత అన్నట్లుగా ఆయన పనితీరు ఉంటుంది. పవన్ కల్యాణ్ చంద్రబాబు రాజకీయాలను కూడా నేర్చుకోవాలనుకుంటున్నారని అనుకోవచ్చు.
కూటమి పార్టీల మధ్య గ్యాప్ ఏర్పడితే..తాము దూరి పోయి ఆ గ్యాప్ ను మరింత పెంచాలనుకునే వైసీపీకి అసలు చాన్సివ్వడం లేదు. అదే సమయంలో జనసేన కార్యకర్తలు పొలిటికల్ రియాలిటీని అర్థం చేసుకోకుండా.. వైసీపీ ట్రాప్ లో పడకుండా కూడా ఆయన తన స్టేట్మెంట్ల ద్వారా కంట్రోల్ చేస్తున్నారని అనుకోవచ్చు. మొత్తంగా పవన్ కల్యాణ్ తన రాజకీయంలో పదిహేనేళ్ల ఫార్ములాకే కట్టుబడ్డారు.