ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సహా దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా తన హయాంలో ఏదైనా అతి పెద్ద అవినీతి స్కాం బయటపెడితే వాళ్ళ మొదట స్పందన ఎలా ఉంటుంది? షరామామూలుగానే ప్రతిపక్ష నాయకులందరూ కూడా పాలకుడు రాజీనామా చేయాలి, ప్రభుత్వం దిగిపోవాలి, మళ్ళీ ప్రజాభిప్రాయం కోరాలి లాంటి నినాదాలు వినిపిస్తారు. మరి అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చెప్తారు? చాలా సింపుల్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అధికారంలో ఉన్నప్పుడు చేసిన స్కాంలతో పోల్చుకుంటే ఇదసలు పెద్ద విషయమేనా? ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి స్కాములు బయటపడినప్పుడు రాజీనామాలు చేశారా? అసలు ప్రతిపక్ష నాయకులకు మమ్మల్ని అడిగే అర్హత ఉందా? అంటూ ఎదురుదాడికి దిగుతారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం వంటి విషయాల్లో కూడా మన నాయకుల వ్యవహారం ఇలానే ఉంటుంది. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులపై వెంకయ్యనాయుడు అయితే ఒంటికాలిపై లేస్తాడు. విభజన సమయంలో ఎపికి అన్యాయం చేసిన కాంగ్రస్‌కి బిజెపిని విమర్శించే అర్హత లేదంటాడు. మొత్తానికి నాయకులందరూ బాగానే ఉంటారు. ప్రజలు మాత్రం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ నీచ రాజకీయాలు చేస్తున్న నాయకుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. అందుకే కొత్తగా ఎవరైనా రాజకీయాల్లోకి వస్తున్నారంటే వాళ్ళ వైపు ఆశగా చూస్తున్నారు. మేము కూడా పాత రోత రాజకీయా విధానాలను అనుసరించేవాళ్ళమే అని అలా వచ్చిన నాయకులు కూడా అరంగేట్రంతోనే నిరూపించుకుంటూ ఉండడంతో హతాశులవుతున్నారు. ఆశాజీవి చిరంజీవి కూడా టిక్కెట్ల అమ్మకం, కొనుగోలు బేరం పెట్టడంతోనే నిజ జీవిత ఠాగూర్ అని భ్రమపడినవాళ్ళకు ఆ భ్రమలు బద్ధలయ్యేలా చేశాడు.
ఇఫ్పుడు పవన్ కళ్యాణ్ కూడా రోజు రోజుకూ చిరంజీవి మార్గంలోనే నడుస్తున్నాడు. 2009 నుంచీ రాజకీయాల్లో ఉన్న పవన్ ఇప్పటి వరకూ కూడా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. తనకు ఖాళీ ఉన్నప్పుడు నాలుగు మాటలు ఆవేశపూరితంగా మాట్లాడి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తే ఆయన హార్డ్ కోర్ సినిమా అభిమానులు కేరింతలు కొట్టొచ్చేమో కానీ ప్రజలకు మాత్రం విరక్తి వచ్చేలా ఉంటుంది పరిస్థితి. అందుకే పవన్ పార్ట్ టైం పాలిటిక్స్‌పైన ప్రజల్లో కూడా ఆశలు సన్నగిల్లుతున్నాయి. టిడిపి భజన మీడియా విషయం పక్కన పెడితే జన నాయకుడు పవన్ అని చెప్పడానికి జర్నలిస్ట్‌లకు కూడా మనస్కరించని పరిస్థితి. పవన్ అభిమానులు కూడా ఆయన పార్ట్ టైం పాలిటిక్స్ విషయంలో కాస్తంత అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కూడా రొటీన్ పాత రాజకీయ నాయకుల్లాగే ఎదురుదాడి పాలిటిక్స్‌కి తెరతీశాడు. నేను చేస్తుంది రైటు అని చెప్పుకునే పరిస్థితులు లేనప్పుడు….అందరూ అదే తప్పు చేస్తున్నారు కదా….నేను చేస్తే తప్పేముంది అని సమర్థించుకోవడం మన నాయకుల స్టైల్. ఇఫ్పుడు పవన్ కూడా అదే చేశాడు. ఫుల్ టైం నాయకులు ఎవరున్నారు? అందరూ కూడా పార్ట్ టైం పొలిటీషియన్సే కదా అని తనను తాను సమర్థించుకున్నాడు. పవన్ మాటలు కొంత వరకూ వాస్తవం కూడా. సీమాంధ్రుల దురదృష్టం ఏంటో తెలియదు కానీ పార్టీల అధినేతల విషయం పక్కనపెడితే మిగతా వాళ్ళలో ఎక్కువ శాతం పార్ట్ టైం నాయకులే. అధినేతలకు కూడా నాయకులు అవసరం లేదు…..బాగా డబ్బున్న వ్యాపారస్తులే కావాలి. కానీ జనసేన పార్టీకి మాత్రం స్వయానా అధినేతే పార్ట్ టైం నాయకుడు. అన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్ నాయకులందరిలోకి నంబర్ ఒన్ పార్ట్ టైం నాయకుడు. అందరిలోకి రాజకీయాల కోసం చాలా తక్కువ టైం కేటాయిస్తుంది పవనే. అది కూడా షూటింగ్ గ్యాప్‌లో ఓ రెండు నిమిషాల్లో ఓ ట్వీట్ చేయడమే పవన్ చేస్తున్న రాజకీయం. ఈ విషయంలో కూడా పవర్ స్టార్‌గారు నంబర్ ఒన్‌గా నిలిచినందుకు ఆయన అభిమానులందరూ గర్వపడతారేమో.
రాజధాని భూ సేకరణ బాధితులు రెండు రోజుల క్రితం కూడా పవన్ ఫొటో పెట్టుకుని, పవన్ ఫోటోకు పూజలు చేస్తూ వాళ్ళ గోడు వినిపించుకున్నారు. పవన్ వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరారు. మీడియాకు చెప్పినట్టుగానే వాళ్ళకు కూడా పవన్ ఒకమాట చెప్తే బాగుంటుందేమో….. ‘ఐ యామ్ ఎ పార్ట్ టైం పొలిటీషియన్…..ఆ…అ….మీరు పిలిచినప్పుడు రాను……నాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తా……అ…ఆ….’ అని చెప్పేస్తే ఓ పనైపోద్దేమో.