ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని మెల్లగా ప్రారంభమవుతున్న ఉద్యమంలోకి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగారు. విద్యార్థుల ఆరోగ్యం.. ప్రాణాలతో చెలగాటమాడవద్దని.. పరీక్షలు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమని తెలంగాణ హైకోర్టు .. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వంపై ఆంక్షలు పెట్టిందని గుర్తు చేశారు. దేశంలోనే కాదు.. ఏపీలోని కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అందుకే.. విద్యార్థుల ప్రాణాలు ఎంతో విలువైవని.. ఇప్పటికైనా గుర్తించి పరీక్షలు రద్దు చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి టెన్త్ పరీక్షలు లాక్ డౌన్ కన్నా ముందే ఏపీలో పూర్తయిపోయేవి. కానీ.. స్థానిక ఎన్నికల కోసం… మార్చి నుంచి ఏప్రిల్కు మార్చారు. కానీ.. కోరనా దెబ్బకు మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. అప్పటి నుంచి జరగలేదు. కరోనా సడలింపులు ఇవ్వగానే జూలైలో నిర్వహిస్తామని ఏపీ సర్కార్ ప్రకటన చేసేసి సన్నాహాలు ప్రారంభించింది. అయితే.. ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చాయి కానీ కరోనా ఇవ్వలేదు. కరోనా ఇప్పుడు విజృంభిస్తోంది. దీంతో.. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు పరీక్షల్ని రద్దు చేసి.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా… గ్రేడ్లు ఖరారు చేసి పై తరగతులకు పంపించాయి. కర్ణాటకలో లాక్ డౌన్ ముగిసే సరికే పరీక్షలు పూర్తయిపోయాయి కాబట్టి.. రిజల్ట్ ఇవ్వడమే మిగిలింది.
ప్రస్తుత పరిణామాలతో ఏపీలోనూ.. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ కూడా అదే డిమాండ్ చేశారు. కేబినెట్ సమావేశం పెట్టలేని పరిస్థితుల్లో ఉంటే… పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యంతో ఎలా చెలగాటమాడుతారని ప్రశ్నించారు. ఇప్పుడు పవన్ కూడా అదే డిమాండ్ వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలో గతంలోనే ఈ డిమాండ్ వినిపించాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా అదే మాట చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.