జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిన్నటికి నిన్న అటు తోట త్రిమూర్తులు ఇటు కన్నబాబు పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఈరోజు ఒక సోషల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంబటి రాంబాబు మీద, చలమలశెట్టి సునీల్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు.
పవన్ మావాడే, కాబట్టి మా కే ఓటు వేయండి అని చెప్పుకునే టిడిపి వైఎస్సార్ సిపి నేతల మీద పవన్ ఫైర్:
అంబటి రాంబాబు సత్తెనపల్లిలో తన ప్రచారంలో భాగంగా, గతంలో పవన్ కళ్యాణ్ తన ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తూ, పవన్ కళ్యాణ్ కి తమ కుటుంబంతో సాన్నిహిత్యం ఉందని, తన కోసమే పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారానికి రాలేదని, కాబట్టి పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు కూడా తనకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నట్లు గా పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబు మీద ఫైర్ అయ్యారు. ఎవరైనా ఇలాంటి వేడుకలు పిలిచినప్పుడు తాను సంస్కారంతో హాజరైతే, దానిని ఇలా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అంబటి రాంబాబు ఆలోచించుకోవాలని, దీనిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను సత్తెనపల్లి ప్రచారానికి రాకపోవడానికి కారణం అనారోగ్యమే తప్ప వేరొక కారణం లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. “అంబటి రాంబాబు గారు, గుర్తుంచుకోండి, మీరు ఓడిపో బోతున్నారు” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
నిన్నటి కి నిన్న తోట త్రిమూర్తులు మీద , మెట్ల సత్యనారాయణ మీద కూడా ఇదే తరహా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేసిన సంగతి తెలిసిందే. వీరు కూడా తమ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ఓటు వేయాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా తోట త్రిమూర్తులు లాంటి నాయకులు ఒకసారి తనను కలిసి, తద్వారా తాము జనసేన లోకి వెళ్తామేమో అనే లీకులు తెలుగుదేశం పార్టీకి ఇప్పించి, దాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ద్వారా కాంట్రాక్టర్లు పొందడం, ప్రాజెక్టులు పొందడం లేదా ఇతరత్రా లబ్ది పొందడం లాంటి పనులు చేసిన విషయం తన దృష్టికి వచ్చిన సంగతి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
చలమలశెట్టి సునీల్ ఉద్దేశపూర్వకంగా నా సమయాన్ని వృధా చేశాడు:
ఇక కాకినాడ ఎంపీ గా తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ మీద కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున , తన కాలాన్ని హరించటానికి వచ్చిన వ్యక్తి అని పవన్ కళ్యాణ్ అన్నారు. తన వద్దకు కొంతమంది జనసైనికుల తో వచ్చిన చలమలశెట్టి సునీల్, త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని వచ్చే అధికారికంగా పార్టీలో జాయిన్ అవుతానని తనతో అన్నాడని, అప్పటికే ఆయన వైఎస్ఆర్సిపి కి రాజీనామా చేసి ఉండడంతో తాను కూడా సరేనని అన్నానని, కానీ ఆయన ఉద్దేశ్య పూర్వకంగా తన కాలాన్ని హరించి వేసి, ఇక్కడ తాను వేరే ఎవరినీ ఆ స్థానంలో తీసుకోకుండా ఉండేలా చేసి, చివరికి వెళ్లి చంద్రబాబు వద్ద చేరి పోయాడు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. అయితే, చలమలశెట్టి సునీల్ చంద్రబాబు వద్దకు వెళ్లి పోయిన సమయంలో, చంద్రబాబు ఒక పవర్ ప్లాంట్ విషయంలో సునీల్ కు లబ్ధి చేకూరుస్తానని హామీ ఇవ్వడం వల్లే ఆయన టిడిపిలోకి వెళ్ళిపోయాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
మీరు పల్లకీలు మోయాలనుకుంటే మోయండి:
తోట త్రిమూర్తులు ని, చలమలశెట్టి సునీల్ ని, కన్నబాబుని, అంబటి రాంబాబు ని, గత రెండు రోజుల్లో తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్, మీ లాంటి నేతలు చంద్రబాబుకు, జగన్ కు పల్లకిలు మోయాలనుకుంటే మోయండి, కావాలంటే నేను కూడా మీకు చిడతలు పంపిస్తాను, వాటిని పట్టుకుని చంద్రబాబు కాళ్ల దగ్గర ( తోట త్రిమూర్తులు , చలమలశెట్టి సునీల్ లను ఉద్దేశించి) కూర్చొని చిడతలు వాయించండి అంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.
అన్నీ వదులుకుని ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో, ఎవరి మద్దతు లేకపోయినా ఒంటరిగా పోరాడుతూ, ఒక వ్యక్తి కష్టపడుతుంటే, అలాంటి వ్యక్తిని వీలైనంత కిందికి లాగాలని ప్రయత్నించే మీలాంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.