ఎన్ని సీట్లని కాదని గెలిచే సీట్లలో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరి పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పొత్తులో మనకు కొంచెం కష్టంగానే ఉంటుందని కానీ.. అసెంబ్లీలోకి బలంగా అడుగుపెడతామన్నారు. అన్నీ సర్దుకునే ముందుకు వెళ్తున్నామన్నారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో 98 శాతం విజయావకాశాలు ఉంటాయన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో మనకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని.. కొంత మంది బాధపడవచ్చన్నారు. 2024లో జనసేన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
చంద్రబాబుతో సీట్ల సర్దుబాటుపై తుది చర్చలు పూర్తి చేసిన తర్వాత పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పట్టుబట్టి ఎక్కువ సీట్లలో పోటీ చేయడం కన్నా.. పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవాలన్న పట్టుదలతోనే పవన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. గెలుపు అవకాశాలపై విస్తృతంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నాలుగైదు ఏజెన్సీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి.. బలమైన అభ్యర్థుల ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని పవన్ సీట్ల సర్దుబాటు అంశంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
పొత్తులో భాగంగా ఎలాగోలా తమ సీటు దక్కించుకోవాలని జనసేనలో నియోజకవర్గ స్థాయి నేతలు వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఐదారు వేల ఓట్లు కూడా తెచ్చుకోని వారు .. సీటుకు తమకు ఇవ్వకపోతే పొత్తుకు ఇబ్బందికరంగా ప్రకటనలు చేస్తామన్నట్లుగా హెచ్చరిస్తున్నారు. వీరందరితో పవన్ సమన్వయం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీ పదవుల్లోనూ మూడో వంతు వంతు వస్తుందని ఆయన చెబుతున్నారు. ధిక్కరించే వారు వెళ్లిపోవచ్చని ఆయన సూచించే అవకాశం ఉంది.