జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ సర్కార్ ను విమర్శించడానికి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లుగా ఉన్నారు. ఈ నెల 30వ తేదీతో.. జగన్ ఆరు నెలల పాలన పూర్తవుతుంది. అయితే.. పవన్ కల్యాణ్ ముందుగానే స్పందించారు. ఈ నెల ఇరవై మూడో తేదీ.. మొదటి ఘడియలు అలా అడుగు పెట్టగానే.. ఇలా ట్విట్టర్లో విమర్శలు ప్రారంభించారు. మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసినప్పటికీ.. కౌంటింగ్ మే 23న జరిగింది. అదే రోజు ఫలితం తేలింది. అందుకే.. జననసేన అధినేత పవన్ కల్యాణ్… ఆరు నెలల పాలన.. ఆరు బౌన్సర్లు వేశారు. ఆ ఆరు మాటలు విధ్వంసం, దుందుడుకుతనం, కక్షాసాధింపు తనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్చిన్నముగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ ఆరింటికి సంబంధించి సంక్షిప్తమైన విశ్లేషణ కూడా చేశారు.
కూల్చివేతలు, వరద నీటితో రాజకీయ క్రీడలు, కార్మికుల ఆత్మహత్యలను ఆరు నెలల్లో జరిగిన విధ్వంసంగా పేర్కొన్నారు. పోలవరం, పీపీఏల రద్దులు , సింగపూర్ ఒప్పందం రద్దు.. లాంటి అంశాలను.. దుందుడుకుతనంతో చేపట్టిన చర్యలుగా వివరించారు. ఇక రాజకీయ కక్ష సాధింపులను మూడో అంశంగా పేర్కొన్నారు. చానెల్స్ బ్యాన్ చేయడం.. జీవోలు తేవడం.. రాజకీయ పార్టీల కార్యకర్తలను వేధించడం.. ఇందులో భాగం. విలేజ్ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి… కొన్ని లక్షల మంది ఉద్యోగాలను రిస్క్ లో పెట్టి.. వారందర్నీ మానసిక వేదనకు గురి చేశారని.. దీన్ని నాలుగో అంశంగా పేర్కొన్నారు. ఇక ఏపీలో అన్ని.. రివర్స్ చేస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థిని గడ్డు పరిస్థితిల్లోకి నెట్టి భవిష్యత్ ను అనిశ్చితిలోకి నెట్టిన వైనాన్ని ఐదో అంశమైన అనిశ్చితిగా పేర్కొన్నారు.
ఉద్యోగులకు జీతాలు వస్తాయో రావో కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉందన్నారు. ఇక తెలుగు మీడియాన్ని రద్దు చేయడం.. సహా పలు అంశాలను.. విచ్చిన్నంగా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పేర్కొన్న అంశాలన్నీ.. నిజమైనవే. ఆరు నెలల కాలంలో.. ఏపీలో పరిస్థితులను కళ్లకు కట్టేలా ఉన్నవే. ప్రమాణస్వీకారం చేసినప్పుడు.. ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న జగన్.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని పవన్ తన విశ్లేషణ ద్వారా తేల్చారు. అంతా బాగానే ఉన్నా.. ఇదంతా.. 30వ తేదీ తర్వాత చేస్తే బాగుండేదన్న విశ్లేషణ.. రాజకీయవర్గాల్లో ఉంది.