చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఈరోజు (బుధవారం) హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సైరాని స్తుతిస్తూ, చిరుని కీర్తిస్తూ, తన గతన్ని స్మరిస్తూ పవన్ కల్యాణ్ ప్రసంగం సాగింది. తను ఓ అభిమానిగా ఈ వేడుకకు వచ్చానని చెప్పుకున్న పవన్, చిరుని ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నాడో.. అలాంటి సినిమాలోనే నటించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. చరిత్ర మర్చిపోయిన ఓ వీరుడి కథని సినిమాగా తెరకెక్కించడం ఆనందంగా ఉందని, ఆ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించడం మరింత సంతోషాన్ని కలిగించిందని, ఈ చిత్రంలో నటించే అవకాశం రాకపోయినా, కనీసం గొంతు ఇచ్చినందుకు గర్విస్తున్నానని చెప్పుకొచ్చాడు పవన్.
ఈ సందర్భంగా తన చిననాటి సంగతుల్ని నెమరు వేసుకున్నాడు. ”అన్నయ్య నా స్ఫూర్తి ప్రదాత. నేను తప్పుడు మార్గంలో వెళ్లకుండా మూడు సార్లు నన్ను కాపాడారు. ఇంటర్లో ఫెయిల్ అయినప్పుడు అన్నయ్య దగ్గరున్న లైసెన్స్ తుపాకీ తీసుకుని కాల్చుకుని చనిపోదామనుకున్నా. కానీ అన్నయ్య ఇచ్చిన కౌన్సిలింగ్ వల్ల స్ఫూర్తి పొందా. ఈమధ్య తెలంగాణాలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు కలచివేశాయి. ఆ ఇంట్లో కూడా అన్నయ్యలా కౌన్సిలింగ్ ఇచ్చే పెద్ద మనుషులు ఉంటే ఆ ఆత్మహత్యలు తప్పేవి. యుక్త వయసులో దేశాన్ని ఎవరైనా ఏమైనా అంటే కోపంతో ఊగిపోయేవాడ్ని. నా ఆవేశం చూసి ఉద్యమాల్లో చేరిపోతానేమో అని అందరూ భయపడ్డారు. అయితే అలాంటి సమయంలో అన్నయ్య నాకు మార్గనిర్దేశనం చేశారు. మరోసారి తిరుపతి ఆత్రమంలో చేరిపోయాను. ఆ సమయంలో అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ.. నీకు బాధ్యతలు ఉంటే, ఇలా మాట్లాడేవాడివి కావు అంటూ అప్పుడు కూడా అన్నయ్యే హితబోధ చేశారు” అంటూ అన్నయ్యతో తన అనుబంధం గుర్తు చేసుకున్నారు.
సైరా నరసింహారెడ్డి కథని సినిమాగా తీయాలన్న మాటల్ని చెన్నైలో ఉన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నానని, కానీ ఎవ్వరూ ధైర్యం చేయలేకపోయారని, ఆ ధైర్యం తన తమ్ముడి లాంటి చరణ్ చేశాడని మెచ్చుకున్నారు. చేస్తే చిరంజీవిగారే చేయాలి, తీస్తే చరణే తీయాలి అనే రీతిలో ఈ సినిమా తెరకెక్కిందని, ఈ సినిమా గురించి చరిత్ర చెప్పుకుంటుందని, ఈ సినిమా రికార్డుల్ని బద్దలు కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు పవన్.