జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాగిస్తున్న ప్రజా పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్రాన్ని విభజించిందో, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భుజాలపై చంద్రబాబు చేతులు వేశారని విమర్శించారు. ఆ పార్టీ మీద చాలా ప్రేమ, వాత్సల్యం ప్రదర్శించారన్నారు. రాహుల్ గాంధీని ఆయన ముట్టుకోవడం చూస్తుంటే తనకు చాలా ముద్దొచ్చిందని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి పద్ధతి చూస్తుంటే, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష నేత జగన్ భుజంపై కూడా చేతులు వేసి.. మనిద్దరం కలిసి పోటీ చేద్దాం రా అని పిలిచినా తాను ఆశ్చర్యపోనని పవన్ అన్నారు. భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ ని, వైయస్సార్ సీపీని కూడా తమతో కలిపేసుకునే చతురత చంద్రబాబుది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వీరందరినీ పోషించగల సొమ్ము టీడీపీ దగ్గర ఉందనీ, ఇసుక మాఫియా ద్వారా సంపాదించింది చాలా ఉందనీ, ఏదైనా చెయ్యగలరనీ ఎద్దేవా చేశారు! తెలుగుదేశం నైతిక బలం కోల్పోయింది కాబట్టే, కేంద్రంపై పోరాటం చేయలేకపోతోందన్నారు. జనసేనకి అలాంటి భయాలు లేవనీ, తెగింపు మాత్రమే ఉందన్నారు. భయపడుతున్నవారు అధికారంలో కూర్చుంటే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందన్నారు.
ఓటుకు నోటు కేసుకి భయపడి ఇన్నాళ్లూ కేంద్రాన్ని ఎదురించలేకపోయారనీ, ప్రత్యేక హోదా పోరాటాన్ని నీరుగార్చేశారన్నారు. ఈరోజున జనసేన రోడ్డు మీదికి రావడానికి కారణం టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. జనసైనికుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ, అలాంటి చర్యల్ని చూస్తూ సహించేది లేదని మరోసారి హెచ్చరించారు. తను ఉంటున్న గెస్ట్ హౌస్ కరెంట్ తీసేశారని మరోసారి ఆరోపించారు. గ్రామగ్రామానా ఎమ్మెల్యేలు జనసైనికులను వేధిస్తున్నారన్నారు!
మొత్తానికి, పవన్ కూడా రెగ్యులర్ రాజకీయ నాయకుడిలానే విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. చేస్తున్న విమర్శలకు ఆధారాల్లాంటివి ఈయనకీ అవసరం లేని అంశంగా మారిపోయింది. గ్రామగ్రామానా జనసైనికులకు వేధింపులు అన్నారు. కనీసం ఆ గ్రామాలు కొన్నైనా చెప్తే బాగుంటుంది కదా! వేధింపులు ఉంటే కేసులు పెట్టొచ్చు కదా. తెలుగుదేశం దగ్గర ఇసుక మాఫియా సంపాదించిన సొమ్ము చాలా ఉందనీ ఆరోపించారు! అది ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో, ఎంతుందో చెబితే ఆయన వాదనకే మరింత బలం చేకూరుతుంది కదా. పవన్ కూడా ఊహాగానాలే ఎక్కువగా మాట్లాడితే ఎలా..?