పవన్ కల్యాణ్ జాతీయ రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారా ?. ఇటీవలి కాలంలో ఆయన జాతీయ రాజకీయం గురించే ఎక్కువ స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువుల పై దాడుల గురించి స్పందించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ ట్వీట్ పెడితే దానికీ ఆయన గురించి గొప్పగా స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఆయన జాతీయ నేతలతో ఎక్కువగా చర్చలు జరిపారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్‌కు జాతీయంగా ఫోకస్ ఎక్కువగా ఉంది. ఆయన ప్రచార శైలికి బీజేపీ అగ్రనేతలు కూడా ఫిదా అయ్యారు. పవన్ ను రాష్ట్ర స్థాయి కంటే జాతీయ స్థాయిలో ఫోకస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ వివాదం సమయంలో పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి హిందూత్వ నేతగా తెరపైకి వచ్చారు. వారాహి సనాతన ధర్మ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఈ సమయంలో ఆయన జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యారు. తమిళనాడులోనూ హాట్ టాపిక్ అయ్యారు. ఓ టీవీ చానల్‌కు పవన్ కల్యాణ్ ఇచ్చిన ఇంటర్యూ హైలెట్ అయింది. తాజాగా ఆయన సీజ్ ద షిప్ అని ఒక్క మాట అంటే.. ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. ఆయనకు జాతీయంగా ఉన్న క్రేజ్ అది అని అర్థం చేసుకోవచ్చు. అటు తెలుగు వాళ్లతో పాటు ఇటు హిందూత్వ వాదుల్లోనూ ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది.
బీజేపీ అగ్రనేతలు మొదటి నుంచి పవన్ కల్యాణ్ జాతీయ రాజకీయాల్లో ఉండాలని కోరుకున్నారు. ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు గురించి చర్చ జరిగినప్పుడు తనను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ పెద్దలు కోరుతున్నారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తప్పని సరి అయితే పిఠాపురం తో పాటు కాకినాడ నుంచి ఎంపీగా కూడా పోటీ చేస్తానన్నారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగానే స్థిరపడిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఆయన క్రేజ్ అంతా వృధా అయిపోతుందని.. జాతీయస్థాయిలో ఆయన అవసరం ఉందని గట్టిగా బీజేపీ పెద్దలు ఒత్తిడి చేస్తే.. పవన్ కూడా అలాగే అటు వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయం రాకెట్ వేగంతో సాగుతోందని అనుకోవచ్చు.