తమిళనాడులోనూ జనసేన పార్టీని విస్తరిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. తంతి టీవీకి ఆయన తాజాగా ఇంటర్యూ ఇచ్చారు. తమిళంలో అనర్గళంగా మాట్లాడగలిగే పవన్ కల్యాణ్.. తమిళ్లోనే ఇంటర్యూ చేశారు. ఇటీవల పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో పవన్ హిందీ విషయంలో చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిర్బంధంగా హిందీ నేర్పించాలనే విధానానికి తాను కూడా వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాను స్వచ్చందంగానే తమిళం, హిందీ నేర్చుకున్నానన్నారు.
బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి లేని భయం దేశంలోని హిందీ భాష నేర్చుకునేందుకు ఎందుకని పవన్ ప్రశ్న. నేతలు పలువురు హిందీ భాషలో ప్రసంగాలు చేస్తుంటారు. కానీ హిందీని వ్యతిరేకిస్తుంటారని విమర్శించారు. డీలిమిటేషన్ తో లోక్సభలో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడాన్ని అంగీకరించకూడదు కానీ పునర్ విభజనతో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గదని తాను నమ్ముతానని తెలిపారు. తమిళనాడులో బీజేపీ పుంజుకునే చాన్స్ ఉందని రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్నారు.
తమిళ ప్రజలు ఆదరణ చూపిస్తే తమిళనాడులో కూడా జనసేనను రంగంలోకి దింపుతామని పవన్ తెలిపారు. పార్టీకి ఇతర రాష్ట్రాలలోనూ అభిమామనులు ఉన్నారని తమిళనాడు ప్రజలు తన ప్రసంగాలను చూస్తారని ఇటీవల పవన్ కల్యాణ్ ప్లీనరీ ప్రసంగంలో పేర్కొన్నారు. సినిమాల అంశంపైనా పవన్ క్లారిటీ ఇచ్చారు. డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు నటిస్తానన్నారు. అంటే పవన్ సినిమా కెరీర్ కూడా సమాంతరంగా కొనసాగుతుందని అనుకోవచ్చు.