అధికారపార్టీని అరకొరగా, విపక్షాన్ని విపరీతంగా విమర్శిస్తున్నారన్న ఆరోపణల నేపధ్యంలో జనసేనాని శుక్రవారం మరోసారి తెదేపా, వైకాపా ల విషయం లో తన వైఖరిని బయటపెట్టారు.
గత ఎన్నికల సందర్భంగా తెదేపా కు మద్దతు పలకడానికి కారణం వివరిస్తూ… పాలనానుభవం, సైబరాబాద్ నిర్మాణం… వంటి అంశాల ను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కి మద్దతు ఇచ్చా అని చెప్పారు. అదే సమయంలో జగన్ పై పలు కేసులు నమోదై ఉన్నాయన్నారు. అప్పుడు ఉన్న ఇద్దరిలో బేరీజు వేసుకుని బాబుకు మద్దతు పలికాను అన్నారు.
కేసుల్లో ఉన్న వ్యక్తికి మద్దతు ఎలా ఇస్తాను అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మీద అభియోగాలు లేకపోతే తనకు కూడా మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదంటూ పవన్ ప్రకటించారు. తనకు పరిటాల రవి గుండు కొట్టించాడంటూ తెదేపా వాళ్ళు పుకారు పుట్టించారని అది నిజం కాదన్నారు. సినిమాల పై విసుగొచ్చి తానే గుండు గీయించుకున్నా అన్నారు.
ఈ సమావేశం లో తొలిసారిగా పవన్ ఓట్లు అభ్యర్ధించడం విశేషం. తన మీద ఉన్న అభిమానాన్ని, ఈలలు, హుషారుతోనే కాకుండా అంతా ఓట్ల రూపంలో చూపించండి అంటూ కోరారు. తాను అధికారంలో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్నా ఒకేలా పనిచేస్తా అన్నారు.