రాజకీయాల్లో ఫెయిలయ్యానని.. కానీ మళ్లీ పట్టుదలగా ప్రయత్నిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యామ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో చార్టెడ్ అకౌంటెంట్స్ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించడానికి ఆయనకు నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దానికి అంగీకరించిన పవన్.. శిల్పకళావేదికలో కిక్కిరిసిన స్టూడెంట్స్ మధ్య స్ఫూర్తి దాయక ప్రసంగం ఇచ్చారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఓటముల గురించి వివరిస్తున్న సందర్భంలో తాను రాజకీయాల్లో ఫెయిలయ్యానని చెప్పారు. ఆ సమయంలో విద్యార్థులు.. సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు.
ఆ తర్వాత స్పీచ్ కొనసాగించిన పవన్ కల్యాణ్ 2019లో తాను ఫెయిలయ్యానని.. కానీ ఓడిపోలేదని.. అందుకే పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నాన్నారు. చార్టెడ్ అకౌంటెన్సీ ఎంత కష్టమో తనకు తెలుసని అందుకే ఫెయిలయినా పట్టు వదలకుండా తనలాగే ప్రయత్నించాలని వారికి సూచించారు. పవన్ కల్యాణ్ సీఏలకు స్ఫూర్తి దాయక విషయాలు చెప్పారు. తన వైఫల్యాలను కూడా తాను సానుకూల దృక్పథంతోనే చూస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. సమాజంలో మార్పు రావాలని కోరుకుంటూ కొంత మంది ఏమీ చేయకుండా కూర్చుంటారని, తాను అలాంటి వాడిని కాదని అన్నారు. తాను ఎంతో కొంత ప్రయత్నించానని చెప్పారు.
తాను విఫలమైన రాజకీయ నేతనన్న విషయాన్ని స్వయంగా అంగీకరించాలని వ్యాఖ్యానించారు. అందుకు తాను బాధపడబోనని చెప్పారు. ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయని అన్నారు. వైఫల్యం అన్నది విజయానికి సగం బాట వేస్తుందని అన్నారు . అయితే పవన్ తనకు తాను విఫల రాజకీయ నేతనని చెప్పుకోవడం.. అందర్నీ ఆశ్చర్య పరిచింది.