యువగళం – నవశకం సభలో పవన్ కల్యాణ్ తన ప్రసంగం చివరిలో బీజేపీ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. బీజేపీ ప్రస్తావన ఎందుకని చాలా మంది ఆశ్చర్యపోయినప్పటికీ… ఓ క్లారిటీ అయితే వచ్చింది. కలిసి రావాలని పవన్ కోరలేదు. కేవలం ఆశీస్సులు మాత్రమే కోరారు. అంటే.. పొత్తులు ఉండవని.. జగన్ రెడ్డికి సహకరించకపోతే చాలన్నట్లుగా మాట్లాడారు.
బీజేపీ కూడా ఏపీలో పొత్తులపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీతో పొత్తులు పెట్టుకునే పార్టీకి ఓటు బ్యాంక్ లాస్ అవుతుందని తేలడంతో ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. కేసుల భయంతో అయినా ఎవరైనా ముందుకు వస్తారేమోనని ఎదురు చూస్తున్నా అలాంటి వ్యూహాలు కూడా పని చేయడం లేదని తేలిపోయింది. దీంతో బీజేపీ నేతలకు.. ఒంటరి పోటీపై హైకమాండ్ నుంచి సంకేతాలు అందినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నేతలు అందరూ పోటీ చేయాల్సిందేనని చెప్పడంతో ఒక్కొక్కరు ఒక్కో నియోజకవర్గంలో పని చేసుకోవడం ప్రారంభించారని అంటున్నారు.
టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసేలా బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ ఈ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. జగన్కు మేం దూరం అని గట్టిగా నిరూపించుకోవాల్సి ఉంది. కానీ ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన తమ కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నాయి. సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా పూర్తయిందని అంటున్నారు. ఈ క్రమంలో మరో పార్టీని కూటమిలో చేర్చుకునే అవకాశం లేదని.. ఎలాంటి రాజకీయం అయినా ఎన్నికల ఫలితాల తర్వాతేనని అంచనా వేస్తున్నారు. అందుకే బీజేపీ సోషల్ మీడియా లో… టీడీపీపైనా విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణలో పొత్తులతో ఏపీలోనూ రాజకీయం చేద్దామని బీజేపీ అనుకున్నప్పటికీ.. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని నేరుగా కిషన్ రెడ్డి ప్రకటించేశారు. అంటే.. జనసేనతో కటీఫ్ చెప్పినట్లే. కానీ జనసేన మాత్రం ఎన్డీఏలో సాంకేతికంగా ఉన్నామని చెబుతోంది. కానీ ఆ పార్టీతో ఎక్కడా కలిసి పోటీ చేసే పరిస్థితి లేదు. ఇక ఏపీలో టీడీపీ, జనసేన కూటమి మాత్రమే పోటీ చేస్తుందని.. బీజేపీ ఒంటరి పోటీనేనని స్పష్టత వస్తోంది.