తమిళ చిత్రసీమలో ఇప్పుడో ఉద్యమం లాంటిది నటిస్తోంది. తమిళ చిత్రాలత్లో తమిళ నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే పని చేయాలని, మిగిలిన వాళ్లకు అవకాశాలు ఇవ్వకూడదని అక్కడి నటీనటులు, టెక్నీషియన్స్ కోరుకొంటున్నారు. ఈ విషయమై టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకూ ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. కానీ తొలిసారి పవన్ కల్యాణ్ నోరు విప్పాడు. బ్రో ప్రీ రిలీజ్ లో ఆయన ఈ విషయమై.. కోలీవుడ్ కి సున్నితంగా క్లాస్ పీకారు. అందరూ కలిసి పని చేయాలని, అప్పుడే చిత్రసీమ వృద్ది చెందుతుందని సూచించాడు. తమిళం నుంచి వచ్చిన సముద్రఖని తెలుగులో మంచి సినిమా తీశారని, తెలుగు వాళ్లకు భాషా బేధాలు లేవని, ప్రతిభావంతుల్ని గౌరవిస్తారని, తమిళ చిత్రసీమ కూడా ఇదే పంథా అనుసరించాలని, ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలు అక్కడి నుంచి కూడా రావాలని కోరుకొన్నారు. తమిళం నుంచి వచ్చినా సముద్రఖని తెలుగు నేర్చుకొని, తెలుగులోనే స్క్రిప్టుని రాసుకొని, తనకు వినిపించారని, సముద్రఖని కష్టం, ఆయన తపన తనకు చెంప పెట్టులా అనిపించిందని, తెలుగు వాళ్లయి ఉండి చాలామందికి తెలుగు స్పష్టంగా మాట్లాడడం రాదని, కానీ సముద్రఖని తెలుగు నేర్చుకొన్నారని, తాను కూడా ఏదో ఓ రోజు తమిళం నేర్చుకొని, తమిళంలో మాట్లాడతానని ఈ సందర్భంగా సముద్రఖనికి మాటిచ్చారు పవన్.
తెలుగు, తమిళ, హిందీ.. అనే సరిహద్దులు చెరిగిపోతున్నాయి. అందరూ కలిసి.. పని చేసే వాతారవణం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో `మా సినిమాల్లో మేమే నటించాలి` అనే సంకుచిత స్వభావమే. దీనిపై పవన్ లాంటి స్టార్ గళం విప్పడం, అందరూ కలిసే ఉండాలి అంటూ హితవు పలకడం నిజంగా అభినందించదగిన విషయమే.