జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజకీయ భాష వంటబట్టించుకున్నారు. వైసీపీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందా అని మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానంతో… రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పుకొచ్చారు. విజయవాడలో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులపై మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అధికారం చేపట్టే విషయంలో తన ప్రకటనల్లో… నిలకడ లేకపోవడాన్ని .. ఆయన వ్యూహాత్మకంగా చెప్పుకున్నారు. తమ పార్టీ పై ఎక్కడా అంచనాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే అలా మాట్లాడుతున్నానన్నారు. గతంలో ప్రజారాజ్యంపై భారీ అంచనాల నేపధ్యంలోనే దెబ్బ తిన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వామపక్ష పార్టీలను తాను నమ్మడం లేదన్నట్లుగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. వామపక్షాలను ఆఖరి నిముషంలో అయినా ముఖ్యమంత్రి ఆకర్షిస్తారు అనే వాదన బలంగా ఉందని… అందుకే కలిసి పోటీ చేసే విషయాన్ని చెప్పలేమన్నారు. బిజెపికి ఇక్కడ బలం లేదు కాబట్టి.. ఆ పార్టీతో కలిసి ముందుకు పోలేమన్నారు. పొత్తులపై ఎన్నికల నాటికి స్పష్టత వస్తుందన్నారు. అనంతపురం జిల్లా నుండి పోటీ చేయాలని అక్కడి వారు అడిగారని.. అందుకే అప్పట్లో అక్కడ పోటీ చేస్తానని చెప్పాన్నారు. ఎన్నికల నాటి పరిస్ధితులు అనుగుణంగా పోటీపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కంటే ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించడానికి వేరే కారణాలు ఏమీ లేవన్నారు. ఉత్తరాంధ్రలోనూ 50రోజుల పాటు ప్రజల్లో నే ఉన్నానని గుర్తు చేశారు.
జనసేన అధినేత పొత్తుల ఎత్తులపై కూడా ఆచితూచి స్పందించి జనసేన కార్యకర్తలను మరింత అయోమయంలోకి నెట్టారు. బీజేపీ పై పవన్ తన వైఖరిని చెబుతుండగా, పక్కనే ఉన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆయన్ను వారించారు. దీంతో వేరే అంశం ప్రస్తావనకు తీసుకువచ్చి పవన్ టాపిక్ ను మార్చారు. ఓవైపు టీడీపీవి అవకాశవాద రాజకీయాలు అంటూనే ఇతర పార్టీల విషయంలో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని చెప్పారు. వామపక్షాలపై నమ్మకం లేనట్లు మాట్లాడారు. అంటే.. భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిమణామాలకు సమీకరణాలకు సంకేతాలు ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు.