వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి.. అన్ని పార్టీలు చిల్లర రాజకీయాలను పక్కన పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, వైసీపీ మధ్య వైరస్ రాపిడ్ టెస్ట్ కిట్ల స్కాం కేంద్రంగా జరుగుతున్న రాజకీయంపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారని.. వారికి అండగా ఉండాల్సిన పార్టీలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. అధికార పార్టీపై పవన్ ఓ రేంజ్ లో ఫైరయ్యారు. తప్పులు ఎత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికారపార్టీ నేతలు కొనసాగిస్తున్నారని.. ప్రజలను కాపాడాల్సిన తరుణంలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
కన్నా లక్ష్మీనారాయణపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చిల్లర రాజకీయమేనని పవన్ తేల్చారుర. ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాల్సిన అవసరముంది. కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదాం. ప్రజలను రక్షించుకుని వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తిల్ని కేంద్రీకరిద్దామని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు ఇలాగే వ్యవహరిస్తే.. ప్రజలు తిరగబడతారని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైనప్పటి నుండి పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించకూడదనే విధానాన్ని అవలంభిస్తున్నారు. ప్రభుత్వం ప్రజల్ని వైరస్ నుంచి కాపాడాలని కోరుతున్నారు.
అయితే… పవన్ కల్యాణ్… నియంత్రణలో ఉండాలని అనుకోవడాన్ని కూడా విజయసాయిరెడ్డి విమర్శించారు. అసభ్య పదజాలంతో ట్విట్టర్లో దూషించారు. నాగేంద్రబాబు దీనిపై స్పందించారు కానీ పవన్ కల్యాణ్ పట్టించుకోలేదు. విజయసాయిరెడ్డి ఎంత రెచ్చగొట్టినా తాను ఇలాంటి సమయంలో…రాజకీయ విమర్శలు చేయబోనని ప్రజలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. అయితే మిగతా పార్టీలు మాత్రం… ప్రజల ప్రాణాలను పక్కన పెట్టి.. రాజకీయంలో మునిగితేలుతున్నాయి.