పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం తిరపతి వేదికగా గర్జించారు. సనాతన ధర్మ డిక్లరేషన్ ను శ్రీవారి పాదాల ముందు ఉంచి బుధవారం పూజలు చేసిన ఆయన.. గురువారం తిరుపతిలో జరిగిన వారాహి సభలో ప్రకటించారు. వాటి విషయంలో అందరూ కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. ఇతర మతాలను గౌరవిద్దాం సనాతన ధర్మాన్ని కాపాడుకుందామన్నా కాన్సెప్ట్‌తో పవన కల్యాణ్ కొత్త ఉద్యమాన్ని చేపట్టారు.
ఈ విషయంలో పవన్ కల్యాణ్ వ్యవస్థలు వ్యవహరస్తున్న తీరును కూడా సునిశితంగా విమర్శించారు. సనాతన ధర్మం వైరస్ అని నిర్మూలించాలని తమిళనాడు యువనేత అన్న మాటల్ని పవన్ ప్రస్తావించారు. అదే ఇతర మతాల విషయంలో అలాంటి వ్యాఖ్యలు చేయగలరా అని సూటిగా ప్రశ్నించారు. కానీ సనాతన ధర్మాన్ని అంటే హిందువులు పట్టించుకోవడం లేదని .. అక్కడే లోపం ఉందని అందరూ ఏం కావాలన్నట్లుగా పవన్ తన వారాహి సభ ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపారు. కోర్టులు కూడా సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కాపాడుతున్నాయని ఈ విషయంలో .. ఇతర మతాల వారికి మాత్రం ఎక్కడా లేనంత మినహాయింపులు వస్తున్నాయన్నారు.
వైసీపీ సనాతన ధర్మానికి చేసిన అన్యాయాల్లో లడ్డూ చాలా చిన్న ఇష్యూ అని స్పష్టం చేశారు. ఇంకా ఎన్నో ఘోరాలు చేశారన్నారు. ఈ విషయంలో అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. ఐదేళ్ల పాటు కొండపై చక్రం తిప్పిన ధర్మారెడ్డి ఎటు పోయారని ప్రశ్నించారు. సనాతన ధర్మం విషయంలో.. పవన చేసిన సూటి ప్రసంగం అందర్నీ ఆలోచింప చేయడం ఖాయమని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కరు కూడా ఇతర మతాలను విమర్శించరు. విమర్శిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ సనాతన ధర్మాన్ని మాత్రం అందరూ విమర్శిస్తూంటారు . వారికి హిందువుల్లోనే మద్దతు లభిస్తూంటుంది.. వ్యవస్థలు కూడా ఈ విషయంలో వివక్షత చూపిస్తున్నయని పవన్ చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ తిరుపతి వేదిక నుంచే సనాతన ధర్మ నినాదాన్ని ఉత్తరాదికి కూడా వినిపించారు. హిందీలో ఇంగ్లిష్‌లో .. తమిళంలో కూడా తన అభిప్రాయాలను అక్కడి ప్రజలకు చేరేలా చేశారు. పవన్ కల్యాణ్ లడ్డూ కల్తీ వ్యవహారం ద్వారా వచ్చిన అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుకుని సంపూర్ణమైన హిందూత్వ , సనాతన ధర్మ వాదిగా ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు ముందుకేస్తున్నారని అనుకోవచ్చు.