వైయస్ షర్మిల ఈరోజు వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపిస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ని ఆ పార్టీ పై స్పందించాల్సిందిగా మీడియా వారు ఇవాళ కోరారు. షర్మిల పార్టీని స్వాగతిస్తున్నాం అని పవన్ దానికి స్పందించారు. వివరాల్లోకి వెళితే..
వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల ఈరోజు పార్టీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్, ప్రజాస్వామ్యంలో ఎప్పటికప్పుడు కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రజల ఆశయాల సాధన కోసం ఎవరు పార్టీ పెట్టినా తాను స్వాగతిస్తానని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, రాజకీయ వారసత్వం ఉన్న వాళ్లు కాకుండా నిజంగా కొత్త వాళ్ళు పార్టీ పెడితే మరీ మంచిది అంటూ చిన్నపాటి చురక అంటించారు. ఇదే సందర్భంగా తెలంగాణలో తన పార్టీని విస్తరించడం పై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ మీదే నని, పార్టీని విస్తరించడానికి కావలసిన వేల కోట్లు తనకు లేవని వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే వైఎస్ఆర్సిపి అభిమానులు, నేతలు, వారి సాక్షి మీడియా, ఒంటికాలిమీద లేస్తూ ఉన్నప్పటికీ, వారి కుటుంబం నుంచి వచ్చిన షర్మిల పార్టీని పవన్ కళ్యాణ్ స్వాగతించడం ఆసక్తికరంగా మారింది.