సుకుమార్… లెక్కల మాస్టారు. త్రివిక్రమ్… మాటల మాస్టారు. కథలు రాయడంలో, సినిమాలు తీయడంలో ఇద్దరివీ వేర్వేరు దారులు. కానీ, దర్శకులుగా ఇద్దరూ ఇద్దరే. హీరోలతో సమానంగా ప్రేక్షకుల్లో స్టార్ హోదా సంపాదించుకున్నవారే. మరి, త్రివిక్రమ్‌కి వచ్చిందేంటి? సుకుమార్‌కి రానిదేంటి? పవన్‌కల్యాణ్‌కి దర్శకత్వం వహించే ఛాన్స్. సాధారణంగా ఇండస్ట్రీలో ఫలానా హీరోతో ఫలానా దర్శకుడు సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట వంటి వార్తలు వస్తాయి. కాని పవన్ హీరోగా సుకుమార్ సినిమా అనే వార్త ఎప్పుడూ రాలేదు. అసలు ప్రయత్నం అనేది జరగనప్పుడు ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఎలా వస్తుంది? అనే సందేహం కొందరికి రావొచ్చు.
నిజం ఏంటంటే… పవన్ హీరోగా సుకుమార్ సినిమా తీయాలని ప్రయత్నించారు. అతణ్ణి కలిశారు కూడా. ‘రంగస్థలం’ విజయోత్సవంలో పవన్ స్వయంగా ఈ సంగతి వెల్లడించారు. అయితే.. ఇది ఇప్పటి మాట కాదు. పదేళ్ల కిందటి మాట. బహుశా… ‘ఆర్య’, ‘జగడం’ సినిమాలు తీసిన తరవాత సుకుమార్ ప్రయత్నాలు చేసి వుండవచ్చు. యధావిధిగా ఏదో ఆలోచనల్లో వున్న నేను సుకుమార్ చెప్పిన కథకి సరిగా స్పందించలేదని పవన్ చెప్పారు. ఇంకోసారి కలుద్దామనుకున్నాను కానీ… కుదరలేదు. సుకుమార్‌తో సినిమా చేసే ఛాన్స్ రాలేదని చెప్పిన పవన్, ‘ఆర్య’ నుంచి తనకు సుకుమార్ ఇష్టమైన దర్శకుడని తెలిపారు.
ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే… పవన్-త్రివిక్రమ్ ప్రయాణానికి విత్తనమూ ఇటువంటి సన్నివేశంతో మొదలైంది. ‘అతడు’ సినిమా కథ చెప్పడం కోసం పవన్ దగ్గరికి త్రివిక్రమ్ వెళ్లాడు. కథ వింటూ వింటూ మధ్యలో నిద్రలోకి జారుకున్నాడు పవన్. అలాగని, త్రివిక్రమ్ వదల్లేదు. మళ్లీ పవన్‌ని కలిశాడు. మూడు సినిమాలు తీశాడు. ఇక రెండేళ్లకు ఓ సినిమా తీసే సుకుమార్‌కి ఇతర సినిమాలతో బిజీగా వుండడంతో పవన్‌ని దర్శకత్వం వహించే అవకాశం రాలేదనుకుంట! భవిష్యత్తులో రాజకీయాలను పక్కనపెట్టి సినిమాలు చేయాలని పవన్ అనుకుంటే… ఇద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే ఛాన్సుంది.