రాజకీయాల్లో గెలిచే వరకూ మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అమరావతిలో జనసేన లీగల్ సెల్ సమావేశంలో ఆనయ మాట్లాడారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు 2009 లో లాంటి తప్పు జరగకూడదు, విభజన జరిగిన రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తులు అవసరం అని ఆలోచించి టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. 2019లో ఓటమి వస్తే నేను వెనుకడుగు వేస్తాను అనుకున్నారని.. ఎప్పటికి అలా జరగదు. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నా దగ్గర వేల కోట్లు లేకపోయినప్పటికీ తాను నిలబడతానని స్పష్టం చేశారు. తాను రాజకీయ పార్టీ పెట్టడానికి కారణం, మార్పు కోసం నడవగలను అనే ధైర్యం, నిలబడగలను అనే నమ్మకమేనని స్పష్టం చేశారు. అధికారంలో లేని అణచివేయబడిన వర్గాలకు అండగా నిలబడాలి అనేదే జనసేన లక్ష్యమన్నారు.
ప్రజారాజ్యం పార్టీ గురించి ప్రసంగంలో పవన్ పరోక్షంగా ప్రస్తావించారు. 2009లో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, అది వివిధ కారణాల వలన నిలబెట్టుకోలేక పోయాం. అలాంటి తప్పు మళ్ళీ నా ఊపిరి ఉన్నంత వరకు జరగకూడదు అని 2014లో జనసేన పెట్టానన్నారు. ” చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోతుంది కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది. తుఫాన్లు చుట్టు ముట్టినా అది ఈ నేలకే అంకితమై ఉంటుంది. సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటి పెట్టుకున్న కోట్ల మంది ప్రజల లాగా నేను కూడా నా పార్టీని, నేలను, దేశాన్ని, సమాజాన్ని వదిలే ప్రసక్తే లేదు…” అని స్పష్టం చేశారు. విలీనం కోసం బీజేపీ ఒత్తిడి చేస్తోందన్నప్రచారం జరుగుతున్న సమయంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం .. బీజేపీకి విలీనం అనే ప్రశ్నే ఉండన్న సంకేతాలు పంపడమని భావిస్తున్నారు.
తన జీవితంలో నేను చేసిన మంచిపని ఏదైనా ఉంది అంటే అది రాజకీయాల్లోకి రావడమేనని పవన్ వ్యాఖ్యానించారు. ఒక్క చాన్స్ ఇద్దాం అని వేసిన, ఏది ఆలోచించి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించిన సరే ఈరోజు అది రాష్ట్రానికి ఇబ్బందిగా మారింది. రాష్ట్రాన్ని వెనక్కు నెట్టేసి పరిస్థితికి తీసుకోచ్చారు. కనీసం ఆడబిడ్డల మాన,ప్రాణాలకు విలువలేదు, రక్షణ లేదు. 14 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైతే ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఇలాంటి సమయంలో జనసేన పార్టీ నాయకులు చట్టసభల్లో ఉంటే బాగుండేది అనిపించిందన్నారు. అసెంబ్లీలో మెజార్టీ ఉంది కదా అని ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటారా అని మండిపడ్డారు.
రాజధాని అంశంలో తాను అన్నివేల ఎకరాల ఎకరాలు వద్దన్నానని..కానీ ఆనాడుప్రతిపక్షంలో ఉన్న నాయకుడు వేల ఎకరాలు కావాలన్నారన్నారు. తీరా ఆయన ఇప్పుడు మూడు రాజధానులన్నారని..మాట మార్చారని.. అలాంటి వారికి పరిపాలన చేసే హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమం నిర్వహిస్తే ఎంతోమంది దివ్యంగులు వారి సమస్యలు చెప్పారు. కనీసం వారికి కూడా అండగా నిలబడలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకని పవన్ మండిపడ్డారు. ఒక నేరం జరిగితే సగం శిక్ష నేరం చేసినవాడికి, పావు వంతు శిక్ష అండగా నిలబడిన వాడికి, ఇంకో పావు వంతు శిక్ష కళ్ళముందు తప్పు జరుగుతున్న ఏమి చేయకుండా నిలబడిన వారికి వేయాలి అని కశ్యప ముని చెప్పారు, అప్పుడే మార్పు వస్తుందని.. లీగల్ సెల్ నాయకులకు సూచించారు.