ఎన్నికల అయిపోయిన కొద్ది గంటలలోపే వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి, తమ పార్టీ 120 స్థానాలలో గెలుపు సాధిస్తుందని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా మర్నాడు తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తమ పార్టీ అలాంటి లెక్కలు వేసుకోదు అని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల తో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే మిగతా పార్టీల లాగా తమకు ఎన్ని సీట్లు వస్తాయన్న లెక్కలు వేసుకోవడానికి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం లేదని, ఎన్నికల్లో పోటీ సందర్భంగా యువ అభ్యర్థులకు ఎదురైన అనుభవాలు ఏంటి, ప్రజలలో ఎంతవరకు మార్పు తీసుకు వచ్చాము, ప్రజలకు మరింత మేలు చేయడానికి పార్టీ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి లాంటి అంశాల మీద చర్చించడానికి ఈ సమావేశాలు ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ వారితో స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు అందరూ రోజుకో గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని, గ్రామస్థాయిలో సమస్యల జాబితా రూపొందించాలని, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడానికి ప్రయత్నించాలని, పార్టీకి అండగా నిలబడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని సూచించారు. మొత్తానికి ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపే దగ్గర నుండి, డబ్బు ఖర్చు పెట్టకుండా ఎన్నికలు ఎదుర్కొనే దగ్గర నుండి, ఎన్నికలయ్యాక కూడా కొత్త తరహా రాజకీయాలను పవన్ కళ్యాణ్ కొనసాగించడం ముదావహం.