జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి లోక్‌సభ సీటును కూడా బీజేపీకి త్యాగం చేసినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని నామినేషన్లు వేసి అభ్యర్థుల్ని విరమింప చేసిన పనన్ కల్యాణ్.. తిరుపతిలోనూ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని… నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీకి సీటు ఇచ్చేందుకు నేరుగా నడ్డాకే తన అంగీకారం తెలిపారని.. ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన సమయంలో తిరుపతి నుంచి బీజేపీ పోటీ చేసే అంశంలో క్లారిటీ వచ్చిందన్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారని ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై అందరి సలహాలు ఇవ్వాలని పార్టీ కార్యవర్గానికి సోము వీర్రాజు సందేశం పంపించారు.
బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో సోము వీర్రాజు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. అభ్యర్థి ఎవరన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ప్రచారం ఎలా ప్రారంభించాలి, వ్యూహం ఏమిటి, ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం ఎలా నిర్వహించాలనే అంశంపై మాత్రం ఏపీ బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సోము వీర్రాజు నిర్ణయించారు. బీజేపీ, వైసీపీ ఒకే లైన్ లో నడుస్తున్నాయనే భావనను తొలగించడానికి ఉన్న పళంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే.. పోటీలో సీరియస్ నెస్ ఉండదన్న చర్చ నడిచింది. అందుకే సోము వీర్రాజు.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెబుతున్నారు.
తిరుపతి లోక్‌సభ విషయంలో బీజేపీ ముందు నుంచీ ఏకపక్షంగా వెళ్తోంది. సీటు తమదేనని ప్రకటించుకుంటోంది. జనసేన మద్దతు ఇస్తుందని కూడా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా మద్దతిస్తారని అంటున్నారు. మొత్తం ప్రకటనలన్నీ బీజేపీ నేతలే చేస్తున్నారు. కానీ జనసేన వైపు నుంచి ఇంత వరకూ ఓ క్లారిటీ రాలేదు. ఇద్దరూ కలిసి.. ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నేతనే నిలబెడుతున్నట్లుగా ప్రకటిస్తే సమస్యే ఉండదు.కానీ జనసేన సైలెంట్‌గా ఉండటంతోనే సమస్యలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలుస్తున్నారు. జనసేన తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.