నేను ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ కంటే పెద్ద హీరోనేం కాదు..
నేను వాళ్లలా పాన్ ఇండియా, గ్లోబల్ స్టార్‌ని కాదు..
నన్ను విదేశాల్లో ఎవరూ గుర్తు పట్టరు..
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.
మా కోసం మీరు కొట్టుకోవద్దు…
– ఇవీ.. పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్లు. ”తనని తాను తగ్గించుకొన్న వాడు – హెచ్చించబడతాడు” అనేది బైబిల్లో మాట. దాన్నే త్రివిక్రమ్ చాలా స్టైలీష్‌గా ”ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెల్సినవాడు గొప్పవాడు” అని రాశాడు. తన స్టేట్మెంట్లతో పవన్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.
పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్‌ల క్రేజ్లతో పోలిస్తే.. తనదేం తక్కువ కాదు. ఓ దశలో.. పవన్ ముందు వీళ్లెవరూ నిలబడలేదు కూడా. అలాంటిది… నాకంటే వాళ్లే పెద్ద హీరోలు అని పవన్ చెప్పుకోవడం తన వినమ్రతకు, ఒదిగి ఉండడానికీ నిదర్శనం.
పవన్‌లో కొన్ని లక్షణాలు తన విరోధుల్ని కూడా తప్పకుండా ఆకట్టుకొంటాయి. `నా సినిమా చూడండి` అని పవన్ ఎప్పుడూ చెప్పడు. తన రికార్డుల గురించో, హిట్ల గురించో స్పీచులు దంచి కొట్టడు. `నాకు డాన్స్ రాదు` అని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. తన ఫలానా హీరోలా నటించలేనని… కుండ బద్దలు కొట్టేస్తాడు. తన బలహీనతల్ని బలంగా ప్రకటించుకోగలడు. ఇంత ధైర్యం ఏ హీరోకీ లేదన్నది వాస్తవం.
పవన్ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లి ఉండొచ్చు గాక. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తుండొచ్చు గాక. కానీ.. పవన్ క్రేజ్ సామాన్యమైనదేం కాదు. రోజుకి 2 కోట్లు పారితోషికం తీసుకోగల సత్తా తనకుంది. పవన్ సినిమా అంటే దర్శకుడెవరు అనేది కూడా చూడకుండా ముందే బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. తనేం పాన్ ఇండియా హీరో కాకపోవచ్చు. పాన్ వరల్డ్ స్టార్ కాకపోవొచ్చు. కానీ పవన్‌తో సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాలూ ఉత్సాహంగా అటువైపు ఓ లుక్కేస్తాయి. టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లు దద్దరిల్లుతాయి. పవన్ సినిమా ఎంత ఫ్లాప్ అయినా, నిర్మాతలు భారీగా నష్టపోవడం ఎప్పుడూ జరగలేదు. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ సినిమాలు వందల కోట్ల వ్యవహారాలు. పవన్‌తో రూ.100 కోట్లతో సినిమా తీస్తే చాలు. పాన్ ఇండియా సినిమాకొచ్చే లాభాల్ని నిర్మాత రాబట్టగలడు. పవన్ ఇప్పటికీ నిర్మాతల పాలిట కొంగు బంగారమే.
అయినప్పటికీ… ‘నేను సామాన్యుడ్ని’ అని ప్రకటించుకొని ఇంకో రెండు మెట్లెక్కాడు పవన్ కల్యాణ్. పవన్ తాజా స్టేట్మెంట్లు.. మిగిలిన హీరోల అభిమానుల మనసుల్నీ గెలుచుకొన్నాయి. పవన్ తమ హీరోని పొగిడాడు అనేసరికి.. వాళ్లు హృదయాలూ విచ్చుకొంటున్నాయి. పవన్ కోరుకొన్నది అదే. దక్కిందీ అదే.