క్రిష్ ‘హరి హర వీరమల్లు’కి మోక్షం లభించింది. పవన్ డేట్ల సర్దుబాటు కాకపోవడంతో అర్థాంతరంగా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని పూర్తి చేయాలని పవన్ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఏకధాటిగా 50 రోజులు ‘వీరమల్లు’ కోసం పవన్ కేటాయించాడు. అక్టోబరు 1 నుంచి `వీరమల్లు` షూటింగ్ పునః ప్రారంభం కానుంది. పవన్ సన్నివేశాలన్నీ ఏక ధాటిగా తెరకెక్కించడానికి క్రిష్ సన్నాహాలు మొదలెట్టారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో కొన్ని భారీ సెట్లు రూపొందించారు. వాటిలోనే ఇప్పుడు షూటింగ్ జరగబోతోంది. తమిళ రీమేక్ `వీనోదయ సీతమ్`కు పవన్ పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘వీరమల్లు’ కంటే ఆ రీమేకే ముందు పట్టాలెక్కుతుందని భావించారంతా. కానీ.. ముందు వీరమల్లు పని పూర్తి చేసే, మిగిలిన సినిమాల్ని మొదలెట్టాలని పవన్ నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. 2023 వేసవిలో ‘వీరమల్లు’ విడుదల కానుంది. పవన్ ఈ యేడాదంతా.. ‘వీరమల్లు’తో పరిపెట్టే ఛాన్సుంది. కొత్త సినిమా ఏదైనా సరే.. వచ్చే యేడాదిలోనే పట్టాలెక్కుతుంది.