వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ఎప్పుడో ప్రకటించేశారు. తెలుగుదేశం, భాజపాలకి గతంలో మాదిరిగా ఇప్పుడు మద్దతు ఇచ్చే పరిస్థితి లేనట్టుగా అంటీముట్టనట్టు ఉంటున్నారు. అయితే, పవన్ మద్దతు కోసం మరోసారి టీడీపీ ఎదురుచూస్తోందనే చెప్పొచ్చు. వాస్తవంగా మాట్లాడుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సోలోగా పోటీ చేసేందుకు కావాల్సి సాధనా సంపత్తి ఇంకా జనసేన దగ్గర లేదు. ఇప్పటికీ పార్టీ నిర్మాణం జరుగుతూనే ఉందని పవన్ చెబుతున్నారు. ఎన్నికలు వచ్చే నాటికి మళ్లీ పవన్ మద్దతు కోసం టీడీపీ ఏదోఒకటి చేస్తుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. జనసేన పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఆ కథనం సారాంశం!
పవన్ కల్యాణ్ కు పదవులపై పెద్దగా ఆసక్తిలేదు కాబట్టి, ఒకవేళ జనసేన గెలిస్తే, ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెగాస్టార్ చిరంజీవి పేరు తెరమీదికి వచ్చే అవకాశం ఉందనేది ఆ కథనం సారాంశం. జనసేనతో కలిసి పనిచేసేందుకు వామపక్షాలు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రాలో ఎలాగూ కాంగ్రెస్ కు పెద్ద దిక్కంటూ ఎవ్వరూ లేరు. కాబట్టి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో జనసేన కలిసే అవకాశం ఉందనీ, ఈ కూటమి ద్వారా చివరికి చిరంజీవిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మెగా ఫ్యామిలీ మెగా ప్లాన్ చేస్తోందంటూ ఆ మీడియాలో కథనం వచ్చింది.
నిజానికి, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది ఊహాజనిత ప్రతిపాదనగానే కనిపిస్తోంది. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఇప్పటికీ మంచిరోజులు వచ్చినట్టు కనిపించడం లేదు. పైగా, రాష్ట్ర విభజనకు కారణమైందనే ముద్రబలంగా ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్ ను పవన్ దగ్గరకి ఎలా చేర్చుకుంటారు..? జనసేనకు జంటైతే కాంగ్రెస్ కి మేలుగానీ, పవన్ కి కొత్తగా వచ్చేది ఏమంటుంది..? ఒకవేళ మెగాస్టార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయాలనుకుంటే… ఆయన జనసేనలోకి వస్తే సాధ్యం కావొచ్చు. అదీ ప్రాక్టికల్ గా కుదరదనే చెప్పాలి. ఎందుకంటే, ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి, ఆ తరువాత కాంగ్రెస్ లో కలిసిపేశారనే అపప్రద చిరంజీవిపై ఉంది. ఒక నాయకుడిగా ఆయన సాధించిన విజయాలు కూడా చెప్పుకునేంతగా ఏవీ లేవు. సో, ఆయన నేరుగా జనసేనలోకి వస్తే… విమర్శలకు కావాల్సినంత అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి, అది కూడా సాధ్యం కాదనే చెప్పాలి!
అలాంటప్పుడు ఈ కథనం ఎందుకు వెలుగులోకి తెచ్చినట్టు..? చాలా సింపుల్.. అనుభవం ఉన్న రాజకీయ పార్టీలతోనే వచ్చే ఎన్నికల్లో జనసేన జత కడుతుందని చెప్పడం! అంటే, ప్రతిపక్ష పార్టీకి పెద్దగా అనుభవం లేదని చెప్పకనే చెప్పినట్టు. గత ఎన్నికల్లో పవన్ కూడా ఇదే మాట చెప్పారు కదా! ఏపీని అభివృద్ధి చేయడానికి అనుభవం లేని వైకాపా కంటే, అనుభవం ఉన్న టీడీపీ, భాజపా కూటములే బెటర్ అన్నారు కదా! ఈ కథనం వెనకున్న ప్రయోజనం ఏంటనేది ఈపాటికే అర్థమైపోయి ఉండాలి. ఒంటరిగా పవన్ బరిలోకి దిగితే ఉపయోగం లేదన్న సూచన చేస్తూనే… అనుభవం గలవారితో దోస్తీ కట్టాలని చెబుతున్నట్టుగా ఉంది. ఆ అనుభవం ఎవరి దగ్గర ఉందని వారు చూపిస్తున్నారో అర్థమౌతోంది కదా!