ప్రదీప్ మాచిరాజు… బుల్లి తెర యాంకర్ గా చిర పరిచయస్థుడు. ఫిమేల్ యాంకర్లలో సుమ ఎంత పాపులరో, మేల్ యాంకర్లలో తాను అంత పాపులర్. చిన్న చిన్న పాత్రల్లో చేశాడు. ఆ తరవాత హీరో అయ్యాడు. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా నిర్మాతలకు ఆర్థికంగా లాభాన్ని అందించింది. ఆ తరవాత… టీవీ షోలకు దూరమై, పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టాడు. ఇన్నాళ్లకు ప్రదీప్ నుంచి మరో సినిమా కబురు వచ్చింది. తను హీరోగా కొత్త సినిమా మొదలైంది. దీనికి ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తొలి సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు దీన్ని… ప్రదీప్ వాడేశాడన్నమాట.
నితిన్ – భరత్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మంకీస్ అండ్ మంకీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రథన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దీపికా పిళ్లై కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ అమ్మాయి కూడా యాంకర్‌గానే పని చేసింది. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఓ యాంకర్ పాప, ఓ యాంకర్ పిల్లాడు కలిసి నటిస్తున్న సినిమా ఇదేనేమో..?! టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఇది ప్రేమకథే అనే విషయం స్పష్టం అవుతోంది. అయితే.. అంతకు మించిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని చిత్రబృందం చెబుతోంది. హీరోగా ప్రదీప్ అదృష్టం ఎలా ఉందో చూడాలి.