జల్లికట్టు పుణ్యమా అని జనసేన పార్టీలో మరోసారి కదలిక బాగానే వచ్చింది..! ప్రత్యేక హోదాపై పోరాటానికి పవన్ కల్యాణ్ మళ్లీ సిద్ధమౌతున్నారు. కాకపోతే.. ఎక్కడ వదిలేశారో అక్కడ మొదలుపెట్టడం లేదు! ఈసారి సభలతోకాదు… సంగీతంతో పోరాటం అంటున్నారు. ట్విట్టర్ ద్వారా ఇదే విషయాన్ని వెల్లడించారు. దేశ్ బచావో పేరుతో ఒక మ్యూజికల్ ఆల్బమ్‌ను రూపొందిస్తున్నట్టు చెప్పారు. చాలారోజుల కిందటే ఆ పాటల ఆల్బమ్‌ను గురించి ఆలోచించాననీ, ఈ నెల 24న వీటిని విడుదల చేస్తానంటూ ట్వీట్ పెట్టారు. అవకాశవాద, వేర్పాటువాద, నేర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడటమే ఈ ఆల్బమ్ ముఖ్యోద్దేశం అన్నారు. అంతేకాదు, ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతుగా ఆంధ్రా యువత విశాఖ సాగర తీరంలో మౌన ప్రదర్శన జరిపితే జనసేన మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
నిజానికి, ఇప్పటికే జనసేన తరఫున ఒక యూట్యూబ్ ఛానెల్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఉన్నాయి. వాటి ద్వారా ఎప్పటికప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన అంశాలను ప్రజలతో పంచుకుంటాం అని గతంలో చెప్పారు! అయితే, వాస్తవంలో ఆయా మాధ్యమాల ద్వారా పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటామేంటో… దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటోందో అనేది వారికే తెలియాలి. ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ ఆల్బమ్ అంటున్నారు..! జనసేన పార్టీని సినీ ఫక్కీలో ప్రజలకు చేరువ చేయాలనుకుంటున్నారేమో..? విడుదల చేస్తామంటున్న గీతాలు బాగుండొచ్చు… ప్రజాదరణకు నోచుకోవచ్చు… సోషల్ మీడియాలో చర్చనీయం కావొచ్చు… యూట్యూబ్‌లో లక్షల వ్యూస్ దాటొచ్చు. కానీ, వాస్తవంలో ప్రత్యేక హోదా సాధనకు ఈ పాటలు ఏ మేరకు ఏ విధంగా ఉపయోగపడతాయన్నది అసలు ప్రశ్న..?
ఓవరాల్‌గా, పవన్ కల్యాణ్ మరోసారి లక్ష్య దూరంగా వెళ్తున్నట్టున్నారు! ప్రత్యేక హోదాపై పోరాటం అంటూ గతంలో కొన్ని సభలు పెట్టారు. ఒక సభకీ మరో సభకీ మధ్య కంటిన్యుటీ లేకుండాపోయింది! ఉద్యమంలో పురోగతి కనిపించకుండా పోయింది. ఇప్పుడు, పాటలనీ సంగీతమనీ కొద్దిరోజులు హడావుడి చేస్తే… మహా అయితే ఓ నాల్రోజులు వార్తల్లో ఉంటారు. అవకాశవాద, వేర్పాటువాద, నేర రాజకీయాలపై కచ్చితంగా పోరాడాల్సిందే. కానీ, ఇప్పుడు అంశం… ప్రత్యేక హోదా కదా! దాన్నుంచీ పవన్ మరోసారి డీవియేట్ అవుతున్నట్టున్నారన్నది విశ్లేషకుల అంచనా.
పాటలు ఉద్యమాలకి ఊపు తెస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంగీత సాహిత్యాలకు కదిలించే శక్తి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటమే అందుకు నిదర్శనం. ఒక స్పష్టమైన విధివిధానాలతో సాగుతున్న ఉద్యమానికి సంగీతం తోడైతే ఊపు వస్తుంది. అంతేకానీ, పాటలు విడుదల చేయడమే ఒక పోరాటం అనుకుంటే ఎలా..?