జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఆంధ్రప్రదేశ్ సర్కార్ పనితీరును వంద రోజులు పరిశీలించిన తర్వాత మాత్రమే… పూర్తి స్థాయిలో తన అభిప్రాయాన్ని వెల్లడించి.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని.. ప్రకటించారు. ఇప్పుడు.. ఆ వంద రోజులు ముగిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై.. ఆయన పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించారు. మొత్తం తొమ్మిది ప్రాధాన్యతాంశాలపై .. గత మూడున్నర నెలల కాలంగా ఏం జరిగిందో పూర్తి సమాచారాన్ని సేకరించారు. వాటిపై.. ఈ నెల పధ్నాలుగో తేదీన అమరావతిలో తన అభిప్రాయాలను వెల్లడించబోతున్నారు. శనివారం.. మంగళగిరిలో ప్రెస్ మీట్ పెట్టి.. మూడున్నర నెలల పాలనలో జగన్ ప్రభుత్వ పాలనపై… ఆయన మాట్లాడనున్నారు.
రాజధాని, ఇసుక విధానం, అభివృద్ధి పనుల నిలిపివేత, పోలవరం ఇలా.. మొత్తం.. తొమ్మిది అంశాలపై పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను పధ్నాలుగో తేదీన వివరిస్తారు. మూడు రోజుల పాటు అమరావతిలోనే ఉండనున్నారు. ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. వంద రోజుల సమయం ఇచ్చినపప్పటికీ… ఇసుక రవాణా చేయకుండా ఆంక్షలు విధించడం వల్ల.. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని… ఓ సారి లే్ఖ రాశారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం స్పందించలేదు. అలాగే.. అమరావతి విషయంలో ప్రభుత్వం తీరును ఆయన తప్పు బట్టారు. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని ప్రకటించారు. ఈ క్రమంలో… ప్రభుత్వానికి వ్యతిరేకంగానే… పవన్ తన కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
పార్టీ వ్యవహారాల్లో చురుకుదనం పెంచాలనుకుంటున్న పవన్ కల్యాణ్… ప్రభుత్వంపై సమరభేరీ మోగించి.. ప్రజల్లోకి వెళ్లే సూచనలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ మేథోమథన సదస్సును నిర్వహించారు. ఇలాంటి సదస్సుల్లో ఇతర జిల్లాల్లోనూ నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని సమస్యలు.. ఇతర అంశాలను ప్రధానంగా… తెలుసుకుని.. వాటి పరిష్కారం దిశగా ఏం చేయాలన్నదానిపై మేథోమథన సదస్సులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వంపై విభిన్న రూపాల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. దానికి ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు.