జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో ఈ రోజు సిపిఎం సిపిఐ నాయకులు జరిపిన చర్చలు ఒక కీలకమైన రాజకీయ ఘట్టాన్ని ఆవిష్కరించాయి. టిడిపి వైసీపీలకు భిన్నమైన ఒక బలీయమైన తృతీయ ప్రత్నామ్నాయాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియా ముందు స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ కేంద్రంపై ప్రధానిపై ప్రత్యక్ష విమర్శ చేయలేదన్న అపప్రధను పోగొట్టే విధంగా పవన్ ఈ సందర్భంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ పార్లమెంటును గౌరవిస్తారని అప్పట్లో తాను అక్కడే వుండి చూసి అనుకున్నానని కాని ఆయన హామీలను నెరవేర్చకపోవడం, అవిశ్వాసాన్ని అనుమతించకపోవడం వల్ల విశ్వసనీయత పోగొట్టుకున్నారని విమర్శించారు. ప్రధాని నిరశన దీక్షను కూడా తాము నమ్మలేమన్నారు. అలాగే ఇంతకాలం బిజెపిని కేంద్రాన్ని బలపర్చిన చంద్రబాబు నాయుడు హఠాత్తుగా ఆందోళనలు చేస్తామంటే నమ్మశక్యం కాదని ప్రకటించారు. 16న ప్రత్యేకహౌదా సాధన సమితి బందపిలుపున్కు మాత్రం మద్దతునిస్తామన్నారు. గతంతో పోలిస్తే కొద్దిసేపే మాట్లాడినా ఈ సారి పవన్ స్పష్టమైన రాజకీయ సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. విజయవాడ పాదయాత్రకు కొనసాగింపుగా అనంతపురంలో తలపెట్టిన కార్యక్రమాన్ని మాత్రం కొంత కాలం వాయిదా వేసినట్టు కనిపిస్తుంది.