జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రసంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకంటే ఎక్కువగా వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. దీన్ని బట్టి ఆయన చంద్రబాబు ఏజంటుగా వ్యవహరిస్తున్నారనేది వైసీపీ అభియోగం. పవన్ ప్రసంగాల్లో చాలా సార్లు వైసీపీ టీడీపీ రెంటినీ కలిపి విమర్శించడం లేదా ముందు జగన్‌ను అనడం జరుగుతుంటుంది. ఇద్దరిలో ఒక్కరికే విమర్శ పరిమితం చేయాల్సిన అవసరం పవన్‌కు లేదన్నది నిజం. ఎవరిపై ఎక్కువ కేంద్రీకరించాలన్నది కూడా ఎవరిష్టం వారిది. అయితే అందులో వ్యూహం ఏమిటన్నది మాత్రం ఆలోచించాల్సిన అంశమే.
పవన్ పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, ఆయన బిఎస్పితో పొత్తు పెట్టుకోవడం తమకు పడే దళిత ఓట్టు చీల్చడానికేనని కూడా వైసీపీ ప్రతినిధులు గట్టిగానమ్ముతున్నారు.
మరోవైపు చూస్తే పవన్‌ను చాలా కాలం పాటు వైసీపీ లెక్కలోకి తీసుకోనేలేదు. తర్వాత ఆయన లోకేశ్‌పై విమర్శలు చేయగానే కొంత ప్రచారం ఇచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ వివాదం వచ్చినప్పుడు కూడా సాక్షిలో ప్రచారం ఇచ్చారు. ఆ రోజుల్లో వైసీపీ ఎంపి ఒకరు పవన్‌తో పొత్తు గురించి కూడా మాట్లాడారు. ఎప్పటికైనా పవన్ తమ దగ్గరకు రావలసిందేనని వైసీపీకి చెందిన వారు అంటుండే వారు. ఆరా తీసేవారు కూడా. అయితే అలా జరగదని నేను అంచనా చెప్పేవాణ్ని. ఇలాటి చర్చల తర్వాత వైసీపీ మళ్లీ పవన్ పార్ట్‌టైం ప్లేయర్, పార్టనర్ అనడం ప్రారంబించింది.
ఈ కాలంలో కవాతులు సభలూ ప్రదర్శనలతో రాష్ట్రమంతాపర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రతిసభలోనూ జగన్‌పై తీవ్ర భాషలో విరుచుకుపడుతూ వచ్చారు. సవాళ్లు విసిరారు. అప్పటికి పాదయాత్రలో వున్న జగన్ కూడా తన పెళ్లిళ్లపై విమర్శతో సహా ఎదురు దాడి చేశారు. ఈ పరిణామాల తర్వాత లింగమనేని ఎస్టేట్ వారి మధ్యవర్తిత్వంలో రహస్య సమావేశం జరిగిందని నిరాధార కథనం ఇచ్చిన సాక్షి తర్వాత కొనసాగించలేదు. వారికి ఆ విషయమై లభించిన ఇన్‌పుట్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోని ఫలితమే ఆ కథనం అని నేను చెప్పాను. నేనున్న ఆ ప్యానల్లో ఆ రోజే వచ్చిన కథపై చర్చ కూడా చేపట్టలేదు. ఇటీవలి కాలంలో ఘోరంగా దెబ్బతిన్న పతాకశీర్షికలో ఇదొకటైంది. ఏది ఏమైనా వైసీపీ జనసేన పవన్ జగన్ వైరం పెరిగేదే గాని తగ్గేది కాదని తేలిపోయింది.
వైసీపీతో పవన్ అవగాహన అవకాశాలపై కథనాలు వస్తున్న సమయంలో ఎబిఎన్ ఛానల్లో కూడా చర్చలో పాల్గొన్నాను. అప్పట్లో స్పందన కోరితే జనసేన వర్గాలు ఒక విషయం స్పష్టం చేశాయి. ఆయన మొదటి నుంచి జగన్‌పై కేసులను తీవ్రంగా తీసుకుంటున్నారనీ, చంద్రబాబును బలపర్చడంలో జగన్‌ను రాకుండా చేయడమనే కోణం కూడా వుందని వారు వివరించారు. ఆ విషయాలు నేను మీడియాలోనూ చెప్పాను. కనుక ఇది కొత్తగా వచ్చిన మార్పేమీ కాదు. ఇంతకూ పవన్ ఎందుకు జగన్‌పై అంతగా విమర్శ చేస్తున్నారంటే ఇంటర్వ్యూలలో వివరించారు. జగన్‌పై కేసులు నడుస్తున్నంత వరకూ సంజాయిషీ చెప్పుకోవలసిందేనని అన్నారు. వాటి నుంచి బయిటపడితే ఆయనతో పొత్తు పరిశీలనకు అభ్యంతరం వుండదని కూడా అన్నారు. అదెలాగూ ఇప్పట్లో జరిగేది కాదని అందరికీ తెలుసు. కేసులు కాంగ్రెస్ అధిష్టానం కక్షతో పెట్టించినవని వైసీపీ అనొచ్చు గాని దాంతో సంతృప్తి చెందడానికి పవన్ మాత్రమే గాక మరే ఇతర పార్టీ సిద్దంగా లేదన్నది నిజం. దానికి తోడు సామాజిక న్యాయం నినాదంతో జగన్ ముఖ్యమంత్రి కుమారుడు కావడంతో ఎప్పుడూ ఈ కులాలు కుటుంబాలే పాలించాలా అన్న పవన్ వాదనకు మరో వూతం దొరికింది.
వీటన్నిటి కన్నా ముఖ్యమైన వ్యూహాత్మక కారణం వుంది. పాతికేళ్ల రాజకీయం చేస్తానని నా లక్ష్యం 2014 అనీ అంటున్న పవన్ ప్రస్తుత ముఖ్యమంత్రికి ప్రత్యామ్నాయంగా తననే చూపించాలనుకుంటున్నారు. ఎన్నికల సమరం టీడీపీ వర్సెస్ వైసీపీ చంద్రబాబు వర్సెస్ జగన్ అన్న చర్చకే పరిమితమైపోతే జనసేన ఉనికికి అర్థమేలేదన్నది ఆయన అభిప్రాయం అనుకోవచ్చు. స్వంత మీడియాతో పాటు ఇటీవల టిఆర్ఎస్ సహవాసం వల్ల కలసి వచ్చిన కొన్నిమీడియా సంస్థలు జగన్‌కు విస్తారమైన ప్రచారం ఇస్తూ ద్విముఖ పోరాటంగా చూపించడం జనసేనకు ఆమోదయోగ్యం కాదు. ఉద్యమాల నేపథ్యంతో తృతీయ రాజకీయ వేదిక కోరుతున్న కమ్యూనిస్టులకు కూడా ఈ విధానం కలసి వచ్చింది. తర్వాత సవన్ అనూహ్యంగా బిఎస్‌పితోనూ అవగాహన కుదుర్చుకుని వచ్చారు. కనుక కేవలం ఒక్కడుగా నటనాయకుడుగా మాత్రమే మిగిలిపోకుండా మూడో వేదిక ఏర్పాటు చేసుకుని మార్పు సాధిస్తానంటూ మాటల పదును విమర్శల ధాటి పెంచారు. చంద్రబాబు వ్యతిరేక వర్గాలన్నిటికి జగనే సమీకరణ బిందువు కాకుండాచూడాలని కోరుకుంటున్న పవన్ బృందం ఎన్నికల చర్చ జగన్ వర్సెస్ పవన్ అన్నట్టు మార్చితే ఎక్కువ ప్రయోజనమని నిర్ధారణకు వచ్చారు. జనాకర్షణ ఆదరణ యువత మద్దతు విభిన్న సామాజిక శక్తుల ప్రాతినిధ్యం వున్న తాను ఆ విధంగానైతే జగన్‌కన్నా మెరుగైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తానని కూడా అనుకుంటుండొచ్చు. ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రిపై లోకేశ్‌పై విమర్శలు ఎలాగూ వుంటాయి. అక్కడే పరిమితమైతే అవన్నీ జగన్‌కు మేలు చేస్తాయన్నది స్పష్టం. జగన్ తనపై వున్న కేసుల నుంచి బయిటపడనంతవరకూ విమర్శ చేయవలసే వుందని అలాటి ఏ ఆరోపణలు లేని తను మెరుగైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తానని జనసేన వ్యూహంగా వుంది.
వామపక్షాలు కూడా రెండు పార్టీలూ దొందూ దొందేనని గుత్తాధిపత్యం పోవాలని చెబుతున్నాయి.జాతీయంగా బిజెపి కాంగ్రెస్‌లపై అన్ని ప్రాంతీయ పార్టీలూ చేసే ఈ విమర్శ రాష్ట్రంలో వైసీపీ టీడీపీలకు వర్తిస్తున్నది. ప్రత్యేక హోదాపై జగన్ నిరసనల కన్నా పవన్ ఆధ్వర్యంలో జరిగిన జెఎఫ్సి ప్రయోగమే టిడిపినిఎక్కువ కంగారు పెట్టిందనేది నిజం. ఆ తర్వాతనే వారుబయిటకు వచ్చారు. ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అన్న పవన్ విమర్శ వుండనే వుంది. కాకపోతే ఈ దశలో జగన్ బిజెపిపై నేరుగావిమర్శలు చేసేందుకు వెనుకాడటం వైసీపీకి పెద్ద ప్రతికూలాంశంగా మారింది. కేసుల కారణంగానే భయపడుతున్నారని పవన్ అంటే అది టిడిపి వాదనలా వుందనవచ్చు గాని వాస్తవం అదేనని అందరికీ తెలుసు. వైసీపీ నేతలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని మాలాటివారికి చెబుతూనే వుంటారు. తెలంగాణ విషయంలోనూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అయితే కెసిఆర్ మద్దతు తీసుకోవడం ద్వారా జగన్ ఈ విషయంలోనూ ఎపిలో ప్రజల భావోద్వేగాలకు వ్యతిరేకంగా వెళ్లారు. తెలంగాణ ఉద్యమం పట్ట ఎంపతీ ప్రకటించిన పవన్ అదే స్థాయిలో ఎపి తరపున కూడా మాట్లాడాలని భావించారు. ఆ వూపులో సంయమనం తగ్గింది, కెటిఆర్ దీన్నే సున్నితంగా ఎత్తి చూపించారు. ఇది సర్దుకోదగిన అంశమే. చెప్పాల్సిందేమంటే ఇక్కడ కూడా జగన్‌కు తప్పో ఒప్పో ఒక విధానం లేదు. హైదరాబాదులో కొందరు నటుటు రచయితలు పవన్‌పై దాడి చేసి జగన్‌ను నెత్తిన పెట్టుకుంటూ మాట్లాడ్డం కూడా ఎపికోణంలో ఉపయోగపడేది కాదు. రాజకీయాలలో ఎవరుఎవరిని విమర్శించాలి, ఎవరి మద్దతు తీసుకోవాలి అన్నది ఎవరికి వారే నిర్ణయించుకుంటారు తప్ప ఇతరుల జోక్యం అందులోనూ ప్రత్యర్థుల ప్రతిస్పందన నిలిచేవి కావు. ప్రతికూలాంశాలను వారు తప్పక ఉపయోగించుకుంటారు. పెళ్లిళ్ల వంటి వ్యక్తిగత విషయాలనే ప్రస్తావించేవారు అత్యున్నత న్యాయస్తానాల వరకూ వెళ్లిన అవినీతి కేసులు చర్చకు రాకూడానికోరుకున్నా రాకుండా వుండవు. వైసీపీ అభిమానులు బాధపడినా ఇది వాస్తవం. చంద్రబాబును మాత్రమే అనకుండా తమను కూడా అంటే ఆయన ఏజంటై పోయినట్టేనని చెప్పడం అనేక పార్టీల వ్యవస్థలో నిలవదు. అయితే ఇలాటి అంశాలలో సమతుల్యత కాపాడుకోవలసిన అవసరం పవన్‌పై వుంటుంది.