వైసీపీ అధినేత జగన్ రెడ్డికి రాజకీయం అంటే తాను చేసేదే అనుకుంటారు. చుట్టూ రెండు వందల మందిని పెట్టుకుని జేజేలు కొట్టించుకుంటే అదే రాజకీయం అనే భ్రమలో ఉండిపోతున్నారు. కనీసం ప్రతిపక్ష నేతగా ఏం చేయాలన్న దానిపైనా ఆయనకు ఓ అవగాహన లేదు. ఓ విపత్తు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు బయటకు వచ్చేవారు కాదు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు బయటకు వచ్చి…బాధితులపై దండయాత్ర చేస్తున్నారు. దీంతో ప్రజలు అసహ్యించుకుని దూరం జరుగుతున్నారు. కానీ గుర్తించడంలేదు.
ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ గీత దాటకుండా.. జగన్ చేయాల్సిన పనులను చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానిది తప్పు ఉందని క్షమాపణ చెప్పారు. అధికారులతో సరిగ్గా పని చేయించుకోకపోవడం తప్పన్నారు. అధికారులు మారాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. బాధితులకు భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం చేతకాని తనాన్ని గుర్తించి.. ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నారు. పవన్ కల్యాణ్ ను చూసి అయినా వైసీపీ బుద్ది తెచ్చుకోవాల్సి ఉంది. కనీసం అలాంటి పనులు చేయలేదు.
రాజకీయంగా ఎంత లేకిగా వ్యవహారాలు నడపాలో వైసీపీ నేతల్నిచూస్తే అర్థమవుతుంది. పరామర్శకు ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు. రాజకీయ నినాదాలు చేస్తూ ఆస్పత్రిలోకి వందల మందితో వెళ్లిపోయారు. రోగుల్ని ఇబ్బంది పెట్టారు. చంద్రబాబును తిట్టాలని కవర్లు పంచి పెట్టారు. ఇలాంటి చావు తెలివితేటలతోనే పదకొండు సీట్లకు వచ్చారు. అయినా మారేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఓడిపోయి ఏడు నెలలు అవుతున్నా బయటకు రాలేదని దుర్భర పరిస్థితి నుంచి బయటపడటానికి వైసీపీ ఏం చేయాలో అది చేయకుండా.. పాత మార్గంలోనే వెళ్తోంది. కనీసం పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయాన్ని చూసి అయినా నేర్చుకోరా ?