దమ్ముంటే నాపై పోటీ చేయాలని.. పవన్ కల్యాణ్‌కు సవాల్ విసరని నాయకుడు వైసీపీలో లేడు. పులివెందులలో జగన్ పై పోటీ చేయాలని అన్న వాళ్లుకూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా వైసీపీలో చేరని ముద్రగడ కూడా అదే సవాల్ చేస్తున్నారు. కాకినాడలో ద్వారంపూడిపై పోటీ చేయలేక పిఠాపురానికి పారిపోతే… అక్కడ తనపై పోటీ చేయాలని తనకు సవాల్ చేయాలని ఓ లేఖ రాసి పడేశారు. జనసైనికులు తనను అమ్మనా బూతులు తిడుతున్నారని కానీ తాను భయపడేది లేదని చెప్పుకొచ్చారు.
మరో నాలుగు పేజీల లేఖ రాసి.. గతంలో చెప్పినవన్నీ చెప్పుకున్నారు. తన గురించి ఘనంగా చెప్పుకున్నారు. పవన్ కోసం తాను ద్వారంపూడిని వదిలి పెట్టలేనన్నారు. అసలు ఎవరు అడిగారో కానీ.. ..ముద్రగడ పవన్ ను కించ పరుస్తూ ఇలా లేఖలు రాస్తూ.. తనను తాను ఓ లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. కాపుల్లో చీలిక కోసం జగన్ చేస్తున్న రాజకీయం అని.. స్పష్టంగానే అర్థమవుతూ ఉన్నా.. కాపు నాయకులు కొంత మంది … వైసీపీకే సపోర్ట్ చేస్తూ పవన్ ను విమర్శిస్తున్నారు.
మొత్తంగా రిజర్వేషన్ల అంశంతో.. కాపులందర్నీ వైసీపీకి ఓటేసేలా చేసిన ముద్రగడ ఇప్పుడు వారంతా పవన్ వెంట నడవకుండా మళ్లీ వైసీపీకే ఊడిగం చేసేలా చేసేందుకు పవన్ నే పావుగా వాడుకుంటున్నారు. ఈ రాజకీయం వల్ల ఎవరు లాభపడతారో కానీ.. కాపులు మాత్రం తీవ్రంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.