జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలు అంతుబట్టకుండా పోతున్నాయి. అమరావతి రైతుల కోసం.. ఉవ్వెత్తున ఎగిసిన పోరాటం.. ఒక్క సారిగా.. బీజేపీతో పొత్తు తర్వాత చల్లబడిపోయింది. రెండు పార్టీలు కలిసి అమరావతి కోసం.. ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతామని.. గొప్పగా ప్రకటించాయి. కానీ తర్వాత చడీచప్పుడూ లేకుండా పోయాయి. బీజేపీ ట్రాప్లో పవన్ కల్యాణ్ పడిపోయారని…అందరూ అనుకుంటున్న సమయంలో.. పవన్ కల్యాణ్ తాను సొంతంగా అమరావతి పోరాటాన్ని కొనసాగించబోతున్నట్లు సూచనలు ఇచ్చారు. అందులో భాగంగా.. పదిహేనో తేదీన ఆయన అమరావతిలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కానీ.. అంతకు ముందే. మరో పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారు. కర్నూలులో రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
అయితే.. పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన రాజధానికి సంబంధించినది కాదు. సుగాలి ప్రీతి అనే విద్యార్థిని కేసుకు సంబంధించిన అంశంలో ఆయన పోరాటం ప్రారంభిస్తున్నారు. 2017లో కర్నూలులో ఓ కాలేజీలో ఈ విద్యార్థిని మృతి చెందింది. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరుగుతోంది. సుగాలి ప్రీతిని అత్యంత దారుణంగా కొంత మంది రాజకీయనేతల అనుచరులే అత్యాచారం చేసి హత్య చేశారన్న అభిప్రాయానికి జనసేనానికి వచ్చారు. వారి కుటుంబానికి న్యాయం చేయాలని… పోరాడుతున్నారు. గతంలోనూ.. ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ హఠాత్తుగా.. అమరావతి అంశం హాట్ టాపిక్ అవుతున్న సమయంలో.. పవన్ కల్యాణ్.. మళ్లీ ఈ అంశాన్ని హైలెట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్న విషయం.
పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన… రాజధాని ఉద్యమకారుల్లో కొత్త అనుమానాలకు తావిస్తోంది. పవన్ కల్యాణ్ ఓ అంశంపై… ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నప్పుడు.. అ అంశం కోసమే… తన పార్టీకి సంబంధించి కీలకమైన పొత్తుల్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు… దాని గురించి పట్టించుకోకుండా.. ఇతర అంశాన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేయడం… తెలివైన రాజకీయం కాదంటున్నారు. ముందుగా అమరావతి రైతులకు మద్దతుగా తాను చేయాలనుకున్నది చేయాలని.. కానీ.. వారి ఉద్యమాన్ని డైవర్ట్ చేసేలా.. ఇతర వ్యవహారాల్ని హైలెట్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. పవన్ కల్యాణ్ కు రాజకీయ సలహాలు ఎవరు ఇస్తున్నారో కానీ… తప్పటడుగులు వేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి బీజేపీతో పొత్తు తర్వాత రాజధాని రైతులకు మద్దతుగా పవన్ పోరాటం తేలిపోయిందనే అభిప్రాయం మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.