రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఆళ్లగడ్డ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాయలసీమ అభివృద్ధికి నోచుకోక పోవడానికి కారణం కొన్ని కుటుంబాల కబంధ హస్తాల్లో రాయలసీమ రాజకీయం చిక్కుకోవడమే అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. ఆళ్లగడ్డ లో జరిగిన ఈ బహిరంగ సభకు కూడా ఎప్పటిలాగే జనాలు తండోపతండాలుగా వచ్చారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా ఎప్పటిలాగానే ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా సాగింది.
ఆళ్లగడ్డ, నందికొట్కూరు లతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పవన్
2014 ఎన్నికల సమయంలో తాను ఆళ్లగడ్డలో పర్యటించలేదు అని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, అందుకు కారణం భూమా కుటుంబం తనను పర్యటించవద్దని కోరడమే అని వివరించారు. శోభ నాగిరెడ్డి గతంలో ప్రజారాజ్యం పార్టీ లో పని చేసినప్పుడు చిరంజీవి కుటుంబానికి సన్నిహితురాలే. ఇప్పుడు(2014) ఆమె ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ సిపి తరపున పోటీ చేస్తున్నందున పవన్ కళ్యాణ్ ని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయవద్దని భూమా నాగిరెడ్డి కోరారని అందువల్లే తాను ప్రచారానికి అప్పుడు రాలేదని పవన్ కళ్యాణ్ వివరించారు. అలాగే తన ఇంటి పేరు అయిన కొణిదల అంటే అర్థం ఏమిటో తనకు తెలియదని, కానీ ఇటీవలే నందికొట్కూరు లోని ఒక గ్రామం పేరు అది అని తెలిసిందని, కేవలం ఐదు వందల కుటుంబాలు ఉన్న ఆ గ్రామానికి, బహుశా పూర్వం ఎప్పుడో తమ ఇంటి పేరుకి సంబంధం ఉందేమో అని పవన్ అన్నారు.
రాయలసీమ వెనుకబాటుతనాన్ని ప్రస్తావించిన పవన్
రాయలసీమ నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ రాయలసీమ ఇప్పటికీ వెనుకబడి ఉందని పవన్ అన్నారు. అధికారిక లెక్కల ప్రకారమే కేవలం రాయలసీమలోనే 269 మంది రైతులు పురుగుల మందు తాగి బలవన్మరణం పొందారని, కానీ దీని గురించి మాట్లాడే వాళ్లే రాయలసీమలో లేకుండా పోయారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ విద్యార్థులు ఫీజులు కట్టి చదువుకోవడానికి కావలసినన్ని విద్యాలయాలు ఉన్నాయి కానీ, ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకోవడానికి కావలసిన పరిశ్రమలు లేవని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ పాలకులకు మన ఫీజులు కావాలి కానీ మనకు ఉద్యోగాలు ఇవ్వరని పవన్ వ్యాఖ్యానించారు. ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ రాయలసీమలో వలసలను ఆపలేకపోతున్నారు అని, కర్నూలు లో ఉన్న ఫ్లోరైడ్ సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడే ప్రతిపక్షం లేదని పవన్ కళ్యాణ్ అటు అధికార పార్టీ మీద, ఇటు ప్రతిపక్ష పార్టీ మీద విరుచుకుపడ్డారు.
కొన్ని కుటుంబాల కారణంగానే రాయలసీమకు ఈ సమస్యలు:
రాయలసీమ సమస్యలను విశ్లేషిస్తూ పవన్ కళ్యాణ్ ఒక కొత్త దృక్కోణాన్ని ప్రదర్శించారు. రాయలసీమ రాజకీయం మొత్తం కొన్ని కుటుంబాల కబంధ హస్తాల్లో పోవడమే రాయలసీమ వెనుకబాటుతనానికి కారణం అని పవన్ విశ్లేషించారు. రాయలసీమ రాజకీయం 60-40 అనే సూత్రం మీద నడుస్తుందని, దీనర్థం ఏమిటంటే 60 శాతం అధికారపార్టీకి 40% ప్రతిపక్ష పార్టీకి కమిషన్లు వెళ్తాయని, వాళ్ళిద్దరూ డబ్బులు పంచుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, మళ్లీ ఎన్నికల సమయానికి ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి మారుతూ రంగులరాట్నం ని తలపిస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ 60- 40 రాజకీయాల కారణంగా ప్రజలు నష్టపోతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
పిరికితనాన్ని వదిలించుకుంటేనే రాయలసీమ సమస్యలకు పరిష్కారం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టిన నాటి నుండి పవన్ కళ్యాణ్ తో కార్యకర్తలు చెబుతున్న విషయం ఏమిటంటే, మా గ్రామంలో ఆ రెండు పార్టీలు తప్ప మరో కొత్త జండా కడితే నాయకులు ఊరుకోరని, నాయకులు తమని బెదిరిస్తున్నారు అని చాలా మంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ తో చెప్పారు. కొన్ని కుటుంబాల నాయకులకు ప్రజలు భయపడుతూ ఉండటం వల్ల రాయలసీమ వెనుకబడి ఉందని, పిరికితనాన్ని వదిలించుకొని రాయలసీమ యువత మార్పు కోసం నడుం బిగించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తాను ప్రాణాలకు తెగించి వచ్చానని, ప్రజలు తనకు మద్దతు ఇస్తే కుటుంబాల కబంధ హస్తాల్లో నుంచి రాయలసీమను విడిపించి, ఇప్పటివరకు అధికారం రుచి చూడని వర్గాలకు అధికారం వచ్చేలా చేస్తానని, మార్పు కోసం రాయలసీమ ప్రజలు జనసేన కు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ మనవి చేసుకున్నారు. రాయలసీమలో ఎన్ని సీట్లు గెలుస్తాం అని తనకు ముఖ్యం కాదని రాయలసీమలో ఎంత మార్పు తీసుకు వచ్చాను అన్నది తనకు ముఖ్యమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
మొత్తం మీద
మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఆసక్తికరంగా కొనసాగుతోంది. కర్నూలు, ఆదోని, ఆళ్లగడ్డలో జనం లక్షలాదిగా వచ్చారు. అయితే వీరు ఎంతవరకు ఓటు వేస్తారన్నది, ఎన్నికలయ్యాక తెలుస్తుంది.