రాఘవేంద్రరావు సినిమాలో పళ్లూ, పూలూ కనిపించడం ఎంత కామనో. పవన్ కల్యాణ్ సినిమాలో అలీ కనిపించడం కూడా అంతే కామన్. తొలి ప్రేమ దగ్గర్నుంచి కాటమరాయుడు వరకూ.. వీళ్ల కాంబినేషన్ బాగా వర్కవుట్ అయ్యింది. `అలీ లేకపోతే నేను సినిమా చేయలేను` అని పవనే స్వయంగా అన్నాడంటే… వీరిద్దరి కెమిస్ట్రీ ఎంత బాగా క్లిక్కయ్యిందో అర్థం చేసుకోవొచ్చు. ఈ ప్రయాణంలోనే ఇద్దరూ ఫ్రెండ్సయిపోయారు.
అయితే.. ఈమధ్య ఇద్దరికీ కాస్త గ్యాప్ వచ్చింది. జనసేన – వైకాపా పార్టీలు సృష్టించిన గ్యాప్ అది. దాంతో… ఇద్దరూ చెరో మాటా అనుకున్నారు. దాంతో… మైత్రీ బంధం పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే.. అవన్నీ మెల్లమెల్లగా తేలిపోతున్నాయి. ఈమధ్య పవన్ గురించి పాజిటీవ్ గానే స్పందిస్తున్నాడు అలీ. తమ మధ్య బంధం అలానే ఉందని చెబుతూ వచ్చాడు. ఇప్పుడు పవన్ సినిమాలో అలీకి ఓ పాత్ర దక్కిందని టాక్. పవన్ ఈమధ్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఓ సినిమాలో అలీకి ఓ మంచి పాత్ర పడిందట. ఆ పాత్ర అలీ చేస్తేనే బాగుంటుందని పవన్ దర్శకుడికి సలహా ఇచ్చినట్టు. దాంతో అలీ ఖరారైనట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. సో.. మళ్లీ వెండి తెరపై వీరిద్దరి మైత్రీనీ చూడొచ్చన్నమాట.