హరీష్ శంకర్ కెరీర్‌కి ఊపు తెచ్చిన సినిమా `మిరపకాయ్`. కమర్షియల్ కథల్ని ఎంత బాగా హ్యాండిల్ చేయగలడో… ఈ సినిమాతో తేలిపోయింది. ఇక.. దానికి పరాక్షాష్ట `గబ్బర్ సింగ్`. హీరోలు పోలీస్ పాత్రలపై మమకారం ఎందుకు పెంచుకుంటారో, ఈ సినిమాతో మరోసారి అర్థమైంది. రెండూ.. సూపర్ హిట్లే. మిరపకాయ్లో.. హీరో ఆపధర్మ లెక్చలర్ అవతారం ఎత్తుతాడు. గబ్బర్ సింగ్ లో హీరో పోలీస్. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్లని మిక్స్ చేయబోతున్నాడు హరీష్. అదీ పవన్ కోసం.
పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఇందులో పవన్ కల్యాణ్ డ్యూయల్ రోల్ పోషించబోతున్నట్టు టాక్. పవన్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నాడని, తొలి భాగంలో పవన్ లెక్చలర్ గా కనిపిస్తే, ద్వితీయార్థంలో.. పోలీస్ అవతావరం ఎత్తుతాడని టాక్. అయితే రెండు క్యారెక్టర్లోనూ ఎంటర్టైన్మెంట్ పీక్ లెవిల్లో ఉంటుందని సమాచారం. తండ్రి పాత్ర అంటే.. వృద్ధుడిగా కాదు. ఆ పాత్ర కూడా యంగ్ లుక్ లోనే కనిపించనుంది. ఈ సినిమా కోసం హరీష్ రెండు మూడు టైటిళ్లని రెడీ చేసి పెట్టుకున్నాడట. ఓ మంచి ముహూర్తం చూసి, టైటిల్ కూడా ప్రకటించేస్తారని తెలుస్తోంది. పవన్ డ్యూయల్ రోల్ చేయడం, తండ్రీ కొడుకులుగా నటించడం ఇదే తొలిసారి.