బీజేపీకి మద్దతుగా గ్రేటర్ ఎన్నికల బరి నుంచి వైదొలిగిన పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరిపేందుకు నాదెండ్ల మనోహర్‌తో కలిసి హస్తినకు వెళ్తున్నారు. నడ్డా అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారయినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత బీజేపీ హైకమాండ్ విజ్ఞప్తి మేరకు పోటీ నుంచి వైదొలిగారు. నాదెండ్ల మనోహర్ ఇంట్లో జరిగిన చర్చల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నప్పటికీ.. ఢిల్లీ నుంచి హైకమాండ్ పెద్దలు చేసిన సూచనలు.. ఇచ్చిన హామీల మేరకే.. పోటీ నుంచి విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో.. ఇప్పుడు.. ఆ మేరకు తదుపరి చర్చల కోసం ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్లో ఎన్నికల ప్రచారం చేస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ ఉంది. ఢిల్లీలో జరిగిన చర్చలను బట్టి .. పవన్.. గ్రేటర్లో ఒకటి రెండు రోజులు ప్రచారం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో వారి ఎజెండాలో ప్రధానంగా ఏపీ రాజకీయ వ్యవహారాలు ఉండే అవకాశం ఉంది. తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. హైదరాబాద్ లో పోటీ చేయడం లేదు కనుక.. తిరుపతిలో తాము పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జనసేన పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ అంశంపై నడ్డాతో చర్చించి.. తమకే ఆ సీటును ఖరారు చేసుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. గతంలో బీజేపీతో పొత్తు ప్రకటన కోసం.. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. చాలా రోజుల తర్వాత మళ్లీ వెళ్తున్నారు. ఏమైనా కీలక పరిణామాలు ఉంటాయేమోనని.. జనసైనికులు ఆసక్తిగా చూస్తున్నారు.